ప్రపంచ దేశాల మధ్య అగ్రరాజ్య/ఆధిపత్య హోదాను నిర్ణయించే స్థాయికి ఒక టెక్నాలజీ చేరుకుంటోంది. ప్రస్తుతం అమెరికా, చైనా, ఐరోపా దేశాలు అందులో పైచేయి సాధించడానికి బిలియన్ల డాలర్లను ఖర్చు చేస్తున్నాయి.
క్వాంటం టెక్నాలజీ భవిష్యత్తు కాదు - అది వర్తమానం. ఈ రంగంలో ఇప్పుడు పెట్టుబడి పెట్టని దేశాలు రేపు వెనుకబడిపోతాయి. ఈ రోజు మనం ఎదుర్కొంటున్న సంక్లిష్ట సమస్యలు - వాతావరణ మార్పులు, వ్యాధి నివారణ, సైబర్ భద్రత, కృత్రిమ మేధస్సు అభివృద్ధి - ఇవన్నీ సాంప్రదాయిక కంప్యూటర్ల సామర్థ్యాలను మించిపోయాయి. క్వాంటం కంప్యూటర్లు సెకన్లలో పరిష్కరించగల సమస్యలకు సాధారణ కంప్యూటర్లకు వేల సంవత్సరాలు పట్టవచ్చు. ప్రపంచం ఇప్పుడు నాల్గవ పారిశ్రామిక విప్లవం మధ్యలో ఉంది. ఈ విప్లవంలో క్వాంటం టెక్నాలజీ కీలక పాత్ర పోషిస్తోంది. సాంప్రదాయిక కంప్యూటింగ్ పరిమితులను అధిగమించి, మానవాళికి అపూర్వమైన సామర్థ్యాలను అందించే శక్తి క్వాంటం టెక్నాలజీకి ఉంది.
ఈ పోటీలో భారతదేశం వెనుకబడకూడదు. క్వాంటం టెక్నాలజీలో ఆధిపత్యం 21వ శతాబ్దపు ఆర్థిక మరియు వ్యూహాత్మక శక్తిని నిర్ణయిస్తుంది. భారతదేశం ఇప్పటికే 'నేషనల్ క్వాంటం మిషన్' కింద గణనీయ పెట్టుబడులు పెడుతోంది.
టెక్నాలజీ ప్రపంచం ఇప్పుడు 'బిట్స్' నుంచి 'క్విబిట్స్' వైపు పయనిస్తోంది. ఒకప్పుడు ఐటీ రంగంలో భారతదేశాన్ని అగ్రస్థానంలో నిలబెట్టిన ఘనత మన తెలుగు నేలకు ఉంది. ఇప్పుడు అదే ఉత్సాహంతో అమరావతి వేదికగా 'క్వాంటం విప్లవం' మొదలైంది. అమరావతి క్వాంటం వ్యాలీ కేవలం ఒక భవన సముదాయం కాదు; అది భారతదేశపు రేపటి భద్రతకు, ఆర్థిక ప్రగతికి, ఆధిపత్యానికి పునాది.
చైనా ఇప్పటికే సురక్షిత క్వాంటం కమ్యూనికేషన్ నెట్‌వర్క్స్‌లో ముందంజలో ఉండగా, అమెరికాలోని గూగుల్ (Willow చిప్), ఐబిఎం (IBM) వంటి సంస్థలు శక్తివంతమైన ప్రాసెసర్లను అభివృద్ధి చేస్తున్నాయి.
IBM, TCS మరియు L&T వంటి దిగ్గజ సంస్థల సహకారంతో 133-క్విబిట్ (133-qubit) సామర్థ్యం గల క్వాంటం కంప్యూటర్‌ను అమరావతిలో ఏర్పాటు చేస్తున్నారు. పురుడుపోసుకుంటున్న అమరావతిని పూర్తిస్థాయి ఎకో సిస్టమ్ 'క్వాంటం వ్యాలీ'గా తీర్చిదిద్దాలనే సంకల్పంతో చంద్రబాబు నాయుడు కంకణం కట్టుకున్నారు. దేశ లక్ష్యాన్ని (జాతీయ మిషన్) బాధ్యతగా తీసుకుని భుజానికెత్తుకున్నారు. జాతీయ ప్రాజెక్టు పోలవరాన్ని పరుగులు పెట్టిస్తున్నట్లే.. నాటి సైబరాబాద్ మయుడు, నేడు దేశ క్వాంటం వ్యాలీ శిల్పిగా పనిచేస్తున్నారు.
ఈ రోజు, ఫిబ్రవరి 7, 2026న పునాది వేస్తున్న భారతదేశ తొలి క్వాంటం హబ్ ప్రాజెక్ట్, అమరావతిని సింగపూర్, బోస్టన్ వంటి గ్లోబల్ టెక్ హబ్స్ సరసన నిలబెట్టనుంది.
పూర్తిస్థాయి క్వాంటం కంప్యూటర్ అందుబాటులోకి వస్తే, రాష్ట్రం గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్లకు కేరాఫ్ అడ్రస్‌గా మారుతుంది. పారిశ్రామికంగానే కాకుండా, సామాన్యుల జీవితాల్లో కూడా ఈ మార్పు రానుంది—ఖచ్చితమైన వాతావరణ అంచనాలు, వేగవంతమైన వ్యాధి నిర్ధారణ పరీక్షలు దీని ద్వారా సాధ్యమవుతాయి. ఈ సంకల్పంలో ప్రభుత్వం మరియు ప్రైవేట్ రంగం మధ్య బలమైన భాగస్వామ్యం అవసరం. అంతర్జాతీయ సహకారం, పరిశోధనా సంస్థలతో అనుసంధానాలు కీలకం. దీర్ఘకాలిక వ్యూహాత్మక ప్రణాళిక మరియు స్థిరమైన నిధుల కేటాయింపు తప్పనిసరి. ఐటీ విప్లవంలో మనం సాధించిన విజయాన్ని 'క్వాంటం' రంగంలోనూ పునరావృతం చేయాల్సిన సమయం ఇది. అమరావతి వ్యాలీ ఈ దిశగా వేస్తున్న వేగవంతమైన అడుగు, భారత్‌ను గ్లోబల్ టెక్ లీడర్‌గా నిలబెట్టడం ఖాయం.
క్వాంటం ద్వారా అణు సిమ్యులేషన్ నుండి బీటలు వారని సైబర్ కోట వరకు వందలాది సమస్యలను వేగంగా పరిష్కరించవచ్చు. కానీ ఆయా రంగాల్లో నైపుణ్యం ఉండాలి. మన బలం మన జీన్స్. స్టెమ్ (సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మెడిసిన్) లో మనం నిష్ణాతులం. పది తరువాత ఇంటర్లో నీట్, జేఈఈ వేలం వెర్రి అనుకోవచ్చు; ఐఐటీ, మెడికల్ సీట్లు అందరికీ రాకపోవచ్చు. కానీ ఆ సబ్జెక్టులలో పునాది గట్టిగా పడుతోంది. అదే మన బలం. ప్రపంచం మన దగ్గరికి వస్తుంది.
ఈ రోజు ప్రపంచ దిశను మార్చి, అమరావతి వైపు అడుగులు వేసేలా చేస్తున్న చారిత్రాత్మకమైన రోజు.
గుర్తుంచుకోండి, 07/02/2026 తేదీని చరిత్రకు సాక్షులుగా!....