తరుణ్ భాస్కర్.. గాయపడిన సింహం

admin
Published by Admin — February 07, 2026 in Movies
News Image

పెళ్ళిచూపులు సినిమాతో దర్శకుడిగా తొలి చిత్రంతోనే సంచలనం సృష్టించాడు తరుణ్ భాస్కర్. ఆ తర్వాత దర్శకుడిగా అతడి నుంచి ఎక్కువ సినిమాలు ఆశిస్తే.. పదేళ్ల వ్యవధిలో ఇంకో రెండు సినిమాలే రిలీజ్ చేయగలిగాడు. ప్రస్తుతం ‘ఈ నగరానికి ఏమైంది’ సీక్వెల్ లైన్లో ఉంది. ఐతే దర్శకుడిగా తక్కువ సినిమాలే చేసినా.. నటుడిగా పలు చిత్రాల్లో నటించి ఆకట్టుకున్నాడు తరుణ్. 

ఇటీవలే అతను లీడ్ రోల్ చేసిన ‘ఓం శాంతి శాంతి శాంతి:’ విడుదలైంది. కానీ ఆశించిన స్పందన రాలేదు. అయినా సరే.. తరుణ్ హీరోగా ఇంకో సినిమా శ్రీకారం చుట్టుకోవడం విశేషం. దానికి క్రేజీ టైటిల్ కూడా పెట్టారు మేకర్స్. గాయపడిన సింహం.. ఇదీ తరుణ్ భాస్కర్ కొత్త సినిమా టైటిల్.

‘కేజీఎఫ్’ సినిమాలో ‘‘గాయపడిన సింహం నుంచి వచ్చే శ్వాస గర్జన కన్నా భయంకరంగా ఉంటుంది’’ అనే డైలాగ్ ఎంత పాపులరో తెలిసిందే. అది మీమ్ మెటీరియల్‌గా మారింది తర్వాతి కాలంలో. దీన్నుంచి స్ఫూర్తి పొందే తరుణ్ హీరోగా కామెడీ సినిమా చేస్తున్నట్లున్నారు మేకర్స్. ఈ టైటిల్‌కు ‘డోంట్ లాఫ్.. ఇట్స్ ఏ సీరియస్ మేటర్’ అంటూ మీమ్స్‌లో పాపులర్ అయిన బాలయ్య డైలాగ్‌ను పెట్టడం విశేషం. ఈ చిత్రానికి ఫిలిం క్రిటిక్, రచయిత సూర్యప్రకాశ్ జోస్యుల కథ అందించాడు. 

కశ్యప్ శ్రీనివాస్ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. దర్శకుడు పవన్ సాధినేని సమర్పణలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని జీ స్టూడియో సంస్థతో కలిసి ముగ్గురు కొత్త నిర్మాతలు ప్రొడ్యూస్ చేస్తున్నారు. ‘ఓం శాంతి..’ సరైన ఫలితాన్ని అందుకోకపోయినా.. తరుణ్ హీరోగా ఇంకో సినిమా రూపొందుతుండడం.. దానికి మంచి సెటప్ కూడా సమకూరడం విశేషం. టైటిల్ పోస్టర్ చూస్తుంటే.. ఈసారి తరుణ్ మంచి ఎంటర్టైన్మెంటే అందించేలా ఉన్నాడు.

Tags
Actor Tharun bhaskar Director
Recent Comments
Leave a Comment

Related News

Latest News