వైసీపీ అధినేత జగన్‌పై సీఎం చంద్రబాబు ఫైరయ్యారు. ఇలాంటి వారిని ఎలా దారికి తీసుకురావాలో తనకు తెలుసునని వ్యాఖ్యా నించారు. పరామర్శల పేరుతో బలప్రదర్శనలు చేస్తారా? అంటూ.. ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ అవుతోం దని.. సాధారణ ప్రజలు ఇబ్బంది పడుతున్నారని తనకు పోలీసులు చెబుతున్నారని తెలిపారు. ఒకరకంగా ఇలాంటి వ్యవహారా లు.. రౌడి రాజకీయాలతో సమానమేనని తెలిపారు. ఇలాంటి వారిని అరికట్టేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించనున్నట్టు చంద్రబాబు ప్రకటించారు.
తాజాగా వైసీపీ అధినేత జగన్.. ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబాన్ని పరామర్శించారు. అయితే.. తాడేపల్లి నుంచి విజయవాడ ఇబ్రహీంపట్నంలో ఉన్న జోగి ఇంటికి 31 కిలో మీటర్లు దూరం. ఈ దూరం ప్రయాణించేందుకు గట్టిగా 20-30 నిమిషాల సమయం సరిపోతుంది. కానీ, జగన్ మాత్రం.. 5-6 గంటల సమయం తీసుకున్నారు. పోలీసులు రూటు మార్చినప్పటికీ.. ఆయన తను ఎంచుకున్న మార్గంలోనే ఈ పరామర్శల యాత్ర చేపట్టారు. తద్వారా సాధారణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ట్రాఫిక్ నిలిచిపోయి గంటల తరబడి నానా తిప్పలు పడ్డారు.
రెండు రోజుల కిందట గుంటూరులో పర్యటించి..మాజీ మంత్రి అంబటి రాంబాబు కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లినప్పుడు కూడా ఇలానే 35 కిలో మీటర్ల దూరాన్ని 5-6 గంటల పాటు పరామర్శల యాత్ర పేరుతో వెళ్లారు. ఈ నేపథ్యంలో సాధారణ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ప్రభుత్వంపై విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. ఇవి పరామర్శల యాత్రలు కావని.. బల ప్రదర్శన యాత్రలని ఆయన పేర్కొన్నారు. ఇలాంటి బలప్రదర్శనలతో రౌడీయిజం చేయడం వంటి రాజకీయాలు తన దగ్గర కుదరదని హెచ్చరించారు.
ఇలాంటి రౌడీ రాజకీయాలను ఎలా అణిచేయాలో కూడా తనకు తెలుసునని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ప్రజా సమస్యలపై పోరాటం చేస్తే సహిస్తామని.. కానీ, ఇలా చిల్లర రాజకీయాలు.. బల ప్రదర్శనలు చేస్తే.. ఇకపై చూస్తూఊరుకునేది కూడా లేదన్నా రు. ఈ సందర్భంగా చంద్రబాబు గతంలో జగన్ పర్యటించినప్పుడు జరిగిన కొన్ని పరిణామాలను ఉదహరించారు. ఇక నుంచి అలాంటి పరిణామాలు జరగకుండా చూస్తామని, వైసీపీ నేతలను ఎలా దారిలోకి తీసుకురావాలో తనకుతెలుసునని హెచ్చరిం చారు. కార్యకర్తలు.. సంయమనం పాటించాలని ఆయన పేర్కొన్నారు.
కాగా, జగన్ రూటు మార్చుకోవాల్సిందేనని గురువారం అర్ధరాత్రే విజమవాడ పోలీసులు తేల్చి చెప్పారు. ఈ క్రమంలో పోలీసులు ఒక రూటును కూడా సూచించారు. దీనిలోనే వెళ్లాలని.. అలా అయితేనే విజయవాడ పర్యటనకు అనుమ తిస్తామని తేల్చి చెప్పారు. అయితే, ప్రభుత్వం తమ నాయకుడి పర్యట నకు భయ పడుతోందని వైసీపీ వ్యాఖ్యానించింది.
ఏం జరిగింది?
వైసీపీ కీలక నాయకుడు, మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటిపై ఇటీవల కొందరు దాడి చేశారు. పెట్రోల్ నింపిన సీసాకు నిప్పంటించి విజయవాడ శివారులోని ఆయన ఇంటిపైకి వేయడంతో మంటలు కూడా రాజుకున్నాయి. సీఎం చంద్రబాబు, ఆయనకుమారుడు, మంత్రి నారా లోకేష్‌లపై జోగి రమేష్ చేసిన తీవ్ర వ్యాఖ్యలకు నిరసనగా.. ఎన్టీఆర్ జిల్లాకు చెందిన కొందరు కార్యకర్తలు.. ఈ ఘటనకు పాల్పడ్డారు. దీంతో వారిపైనా పోలీసులు కేసు నమోదు చేశారు.
ఈ క్రమంలో జోగి రమేష్‌కుటుంబ సభ్యులను పరామర్శించాలని మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్ నిర్ణయించుకున్నారు. దీనిలో భాగంగానే.. శుక్రవారం ఆయన ఇబ్రహీంపట్నంలోని జోగి రమేష్ ఇంటికి వెళ్లారు. అయితే, దీనికి సంబంధించిన షెడ్యూల్ రూట్‌ను విజయవాడ పోలీసులకు వైసీపీ నాయకులు రెండు రోజుల కిందటే ఇచ్చారు.
వైసీపీ రూట్ ఇదీ..
తాడేపల్లి నుంచి బయలు దేరే జగన్.. విజయవాడ-గుంటూరు హైవేపై ఉన్న కనకదుర్గ వారధి మీదుగా విజయవాడలోకి ప్రవేశిస్తారు. అటు నుంచి బందరు రోడ్డు మీదుగా కనకదుర్గమ్మ ఆలయానికి.. అటు నుంచి విద్యాధరపురం, భవానీ పురం గుంటుపల్లి మీదుగా విజయవాడ-హైదరాబాద్ హైవేపైకి ఎక్కి.. అటు నుంచి ఇబ్రహీంపట్నం చేరుకుంటారు. ఈ మొత్తం దూరం 31 కిలో మీటర్లు. అయితే.. ఇదంతా జనసమ్మర్థం ఉన్న ప్రాంతం. పైగా కీలకమైన వ్యాపార సముదాయాలు కూడా ఉన్న ప్రాంతం.
పోలీసుల రూటు ఇదీ..
జనసమ్మర్థ ప్రాంతాల మీదుగా జగన్ వెళ్తే.. తమకు ఇబ్బందులు వస్తాయని భావించి పోలీసులు.. రూట్ మార్చేశారు. కనకదుర్గ వారధి వరకు ఓకే చెప్పిన పోలీసులు.. అటు నుంచి హైవే మీదుగా.. ఏలూరు-హైదరాబాద్ హైవే(విజయవాడ పశ్చిమ హైవే) మీదుగా ఇబ్రహీంపట్నం చేరుకోవాలని తేల్చి చెప్పారు. ఈ దారిలో ఎలాంటి ఇళ్లు ఉండవు. ఇంకా రహదారి డెవలప్ అవుతోంది. దీంతో ట్రాఫిక్ ఇబ్బందులు ఉండవని పోలీసులు చెప్పారు.
జగన్ ఏం చేశారు?...
జగన్ మాత్రం పోలీసుల మాట పెడ చెవిన పెట్టి తన బల ప్రదర్శన కార్యక్రమాన్ని గతంలో మాదిరిగానే కొనసాగించారు. దీంతో, ఐదారు గంటలపాటు ట్రాఫిక్ జాం అయింది. జనం నానా ఇబ్బందులు పడ్డారు. ఈ క్రమంలోనే జగన్ పై చంద్రబాబు సీరియస్ అయ్యారు. ఇటువంటి వారిని కట్టడి చేసేలా ప్రత్యేక కార్యచరణ రూపొందించబోతున్నామని చంద్రబాబు ప్రకటించారు.