ఏపీ సీఎం చంద్రబాబుకు వైసీపీ నాయకుడు, కాపు సామాజిక వర్గం కోసం గతంలో ఉద్యమించిన ముద్రగ డ పద్మనాభం తాజాగా సోమవారం లేఖ సంధించారు. దీనిలో పలు విషయాలను ఆయన ప్రధానంగా ప్రస్తావించారు. కాపు సామాజిక వర్గం అంతా ప్రస్తుత కూటమి ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహంతో ఉందన్నారు. అదేసమయంలో కాపులు కేవలం డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కోసమే గతంలో టీడీపీకి మద్దతిచ్చారని తెలిపారు. కానీ, ఇప్పుడు వారే.. ఈ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు.
కాపులపై కక్ష కట్టినట్టుగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని ముద్రగడ ఆరోపించారు. రాజకీయాల్లో విమర్శలు, ప్రతివిమర్శలు కామనేనని.. గతంలో జగన్‌ను కూడా తీవ్ర పదజాలంతో దూషించిన విషయాన్ని చంద్ర బాబు మరిచిపోయారా? అని ప్రశ్నించారు. అంబటి రాంబాబుపై కర్రలు, రాళ్లు, కోడిగుడ్లతో దాడులు చేయడం రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి ఎలా ఉందో చాటి చెబుతోందన్నారు. ఈ విషయాలపై కేంద్రానికి లేఖ రాయాలని భావిస్తున్నట్టు తెలిపారు.
రాష్ట్రంలో అత్యవసర పరిస్థితి నెలకొందని, ఈ నేపథ్యంలో ఎమర్జెన్సీ విధించాలని ప్రధానికి లేఖ రాయాలని ఉందన్నారు. కానీ, ఈ లేఖ రాస్తే.. ముందుగా ప్రతిపక్షం లేకుండా చేయాలని.. వారందరినీ జైల్లో పెట్టాలని ప్రధాని నుంచి ఆదేశాలు వస్తాయనే ఆలోచనలో ఉన్నానని ముద్రగడ వ్యాఖ్యానించారు. గత ఎన్నికల్లో కాపులు ఎన్నో ఆశలు పెట్టుకుని కూటమి సర్కారుకు మద్దతు ఇచ్చారని తెలిపారు. కేవలం పవన్ కల్యాణ్ కోసం కాపులు ఏకమయ్యారని గుర్తు చేశారు.
కానీ, ఇప్పుడు వారంతా ఈ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని ముద్రగడ వ్యాఖ్యానించారు. ఈ నేప థ్యంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులను చక్కదిద్దేందుకు ముఖ్యమంత్రిగా చంద్రబాబు జోక్యం చేసుకోవాల ని ముద్రగడ కోరారు. కాగా.. కూటమి ప్రభుత్వానికి ముద్రగడ తొలిసారి లేఖ రాయడం గమనార్హం. ప్రస్తుతం ఆయన అనారోగ్య కారణాలతో ఇంట్లోనే రెస్టు తీసుకుంటున్నారు.