జోగి రమేశ్ కు బుచ్చి రాం ప్రసాద్ వార్నింగ్

admin
Published by Admin — February 02, 2026 in Andhra
News Image
కోట్లాది భక్తుల విశ్వాసంపై దాడి చేసి తిరుపతి లడ్డు అంశాన్ని రాజకీయంగా వాడుకోవడం మహా పాపం అని
ఏపీ బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ చైర్మన్ కె.బుచ్చి రాంప్రసాద్ అన్నారు. సోమవారం మచిలీపట్నంలో పర్యటించిన సందర్భంగా సిడింబి అగ్రహారంలోని బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ పి.వి. ఫణి కుమార్ కార్యాలయంలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ క్రమంలోనే వైసీపీ నేతలపై ఆయన విమర్శలు గుప్పించారు.

వైసీపీ నేతల సైకో రాజకీయాలు హద్దులు దాటాయని మండిపడ్డారు. కోట్లాది భక్తుల హృదయాల్లో కొలువై ఉన్న కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారి మహా ప్రసాదమైన లడ్డూను కూడా రాజకీయ లబ్ధి కోసం వైసీపీ నేతలు వాడుకున్నారని మండిపడ్డారు. అది వైసీపీ నేతల దిగజారుడు మనస్తత్వానికి పరాకాష్ట అని అన్నారు. భక్తుల విశ్వాసంతో ఆడుకోవడం రాజకీయాలు కాదని, అది మహా పాపమని స్పష్టం చేశారు.

తిరుమల తిరుపతి దేవస్థానాల మహా ప్రసాదం పవిత్రతపై ఎన్ని అబద్ధాలు ప్రచారం చేసినా, చివరకు నిజమే గెలుస్తుందని, స్వామివారి ముందు ఎవరూ తప్పించుకోలేరని అన్నారు. లడ్డు అంశాన్ని వక్రీకరిస్తూ భయాందోళనలు సృష్టించడం ద్వారా రాష్ట్రంలో అశాంతి రేపాలనే వైసీపీ కుట్రలను ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. టీటీడీ లడ్డు వంటి అత్యంత సున్నితమైన అంశాన్ని కూడా వదలకుండా రాజకీయం చేయడం సరికాదని హితవు పలికారు.

వైసీపీకి భక్తి లేదని, నమ్మకం లేదని, విలువలు లేవని లడ్డూ అంశంతో స్పష్టమవుతోందన్నారు. ఈ క్రమంలోనే వైసీపీ నేతల దిగజారుడు భాషపై కూడా ఆయన మండిపడ్డారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై అంబటి చేసిన అనుచిత వ్యాఖ్యలు, ఆ వెంటనే మంత్రి నారా లోకేష్ పై జోగి రమేశ్ చేసిన అసభ్యరమైన వ్యాఖ్యలు వైసీపీ రాజకీయ దివాళాతనానికి నిదర్శనమన్నారు.

“జోగి రమేశ్… నోరు అదుపులో పెట్టుకో...అంటూ వార్నింగ్ ఇచ్చారు. రాజకీయాలు అంటే బూతులు కాదని, భక్తుల విశ్వాసం, ప్రజాస్వామ్యం రెండింటినీ గౌరవించడం అని, ఆ విషయం జోగి రమేశ్ నేర్చుకోవాలని హితవు పలికారు. స్వాతంత్ర సమరయోధులకు గౌరవం లేని వ్యక్తి దేశభక్తి గురించి పేర్ని నాని మాట్లాడడం విడ్డూరమని విమర్శించారు.

మచిలీపట్నంలో ప్రజల ఆకాంక్ష మేరకు మంత్రి కొల్లు రవీంద్ర, ఎంపీ వల్లభనేని బాలశౌరిలు స్వాతంత్ర సమరయోధుడు భోగరాజు పట్టాభి సీతారామయ్య పేరిట స్మారక భవనం నిర్మించి యువతకు శిక్షణలు ఇవ్వాలనుకుంటున్నారని, దానికి పేర్ని నాని అడ్డుపడడం సరికాదని అన్నారు. పేర్ని నానికి యువత భవిష్యత్తు పట్ల, స్వాతంత్ర సమరయోధుల పట్ల గౌరవం లేదని స్పష్టమవుతోందన్నారు.

చంద్రబాబు నాయుడికి ఏ మాత్రం సంబంధం లేని కేసుల్లో అక్రమంగా ఇరికించి అరెస్టు చేసిన వైసీపీ పాలన చివరకు న్యాయస్థానాల్లో బట్టబయలైందని గుర్తు చేశారు. “నిప్పుకు చద పట్టదు – నీతికి కాలం చెల్లదు” అన్న నానుడి స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో నిజమైందన్నారు. కూటమి ప్రభుత్వంలో బ్రాహ్మణుల అభివృద్ధి, సంక్షేమం కోసం బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ ద్వారా నిరంతరంగా పని చేస్తున్నామని తెలిపారు.

ఇకనైనా అంబటి రాంబాబు, జోగి రమేష్, పేర్ని నాని లాంటి వైసీపీ నేతలు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని, లేకపోతే ప్రజలు మాటలతో కాదు చేతలతో చరిత్రలో తగిన స్థానం చూపిస్తారని వార్నింగ్ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్లు పి.వి.ఫణి కుమార్, చివుకుల దుర్గాప్రసాద శాస్త్రి, వాడపల్లి బాలాజీ సువర్ణ కుమార్, సర్వ లలిత కుమారి తదితరులు పాల్గొన్నారు.
News Image
Tags
AP brahmana corporation chairman buchi ram prasaad jogi ramesh warning tirupati laddu adulteration
Recent Comments
Leave a Comment

Related News