రాజకీయాల్లో నాయకులు లెక్కలు వేయడం మామూలే. కానీ, ఓటర్ల జేబుల్లోకి రావాల్సిన కరెన్సీ నోట్ల లెక్కలను కూడా పార్టీల వారీగా బహిరంగంగా బేరీజు వేయడం ఒక్క వైఎస్సార్‌కాంగ్రెస్ పార్టీ నేతలకే చెల్లిందేమో. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సిన ఎన్నికల వేళ, ఏకగ్రీవాల వల్ల ఓటర్లకు రావాల్సిన అసలు సిసలు ఆదాయం ఎలా కోల్పోయారంటూ వైసీపీ(YCP) మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి బయటపెట్టిన లెక్కలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి.
అసలు ఎన్నికలు జరిగితే పరిస్థితి ఎలా ఉండేదో రాచమల్లు(Rachamallu Siva Prasad Reddy) పూసగుచ్చినట్లు వివరిస్తూ ఒక సరికొత్త ఆర్థిక సిద్ధాంతాన్ని తెరపైకి తెచ్చారు. ఆయన లెక్కల ప్రకారం.. ప్రతి కుటుంబంలో నలుగురు ఓటర్లు ఉంటారట. కూటమి పార్టీ వాళ్ళు ఒక కుటుంబానికి రూ. 8,000, తమ పార్టీ తరఫున మరో రూ. 8,000 ఇస్తే మొత్తంగా ఒక్కో ఇంటికి రూ. 16,000 దక్కేవట. ఏకగ్రీవాల పుణ్యమా అని దసరా పండుగ పూట ఓటర్లకు రావాల్సిన ఈ రూ. 16,000 పండుగ కానుక గల్లంతయిపోయిందని ఆయన తెగ బాధపడిపోతున్నారు. ఓటర్ల కడుపు కొట్టారంటూ కూటమి ప్రభుత్వాన్ని వేలెత్తి చూపుతున్నారు.
ఇక్కడ అసలు సిసలు ట్విస్ట్ ఏమిటంటే.. ఓటర్ల సంక్షేమం గురించి మాట్లాడాల్సిన ప్రధాన రాజకీయ పార్టీలు, ఓటు(Vote)కు రేటు ఇంత అని పబ్లిక్‌గా లెక్చర్లు దంచడం చూస్తుంటే సామాన్యుడికి నవ్వుడా లేక ఏడుపా అర్థం కాదు. ఎన్నికలు అంటే సిద్ధాంతాలు, అభివృద్ధులు, ప్రజా సమస్యల చర్చలు జరగాలి. కానీ మన దగ్గర మాత్రం ఓటుకు ఎంత రేటు పడింది? ఏ పార్టీ ఎంత ముట్టజెప్పింది? అనే లెక్కలే ప్రధాన ఎజెండాగా మారుతున్నాయి.
మరి ఈ స్థాయిలో ఓటర్ల(Voters) కొనుగోళ్లకు కోట్లు వెచ్చించి గెలిచే నేతలు.. ఆ తర్వాత ప్రజల సమస్యలను ఏమాత్రం పట్టించుకుంటారని ఆశించడం? కేవలం స్థానిక ఎన్నికలకే కుటుంబానికి రూ. 16 వేలు ఖర్చు పెడితే, ఇక రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఈ రేట్లు ఏ రేంజ్‌కి వెళ్తాయో తలచుకుంటేనే భయమేస్తోంది. ఏదేమైనా, నిత్యావసరాల ధరలు పెరిగి సామాన్యుడు అల్లాడిపోతుంటే, మరోవైపు మాజీ ఎమ్మెల్యేల లెక్కల ప్రకారం ఓటు రేట్లు కూడా పెరిగిపోవడం విశేషమే. మొత్తానికి ఏకగ్రీవాలొచ్చి తమ జేబులు ఖాళీ చేశాయంటూ ఓటర్ల కంటే ఎక్కువగా నాయకులే బాధపడిపోవడం ఈ రాజకీయాల ప్రత్యేకత.