రణబాలి ఎఫెక్ట్.. 400 కుటుంబాలకు విరోష్ భరోసా!

admin
Published by Admin — October 14, 2026 in
News Image

సినిమా అనేది కేవలం మూడు గంటల వినోదం మాత్రమే కాదు.. కొన్నిసార్లు అది సమాజంలో బలమైన మార్పునకు తొలి అడుగుగా మారుతుంది. తెరపై కనిపించే పాత్రలు ప్రేక్షకుల హృదయాలను హత్తుకోవడమే కాకుండా, నటీనటుల నిజ జీవిత ప్రవర్తనపై కూడా తీవ్ర ప్రభావం చూపుతాయనడానికి తాజా ఉదాహరణే విజయ్ దేవరకొండ(Vijay Deverakonda), రష్మిక మందన్నల నిర్ణయం. ఈ టాలీవుడ్ స్టార్ కపుల్‌ తమ ఆన్-స్క్రీన్ ప్రయాణాన్ని రియల్ లైఫ్ సేవా దృక్పథంతో ముడిపెట్టి మరోసారి తమ పెద్ద మనసును చాటుకున్నారు.

రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక పీరియాడిక్‌ యాక్షన్‌ డ్రామా 'రణబాలి(Ranabaali)'. 1876-78 మధ్య మద్రాస్ ప్రాంతాన్ని కుదిపేసిన కరవు నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ యోధుడిగా కనిపించనుండగా, రష్మిక 'జయమ్మ' అనే శక్తివంతమైన పాత్రను పోషిస్తున్నారు. అయితే, ఈ సినిమాలో జయమ్మ ప్రదర్శించే దానగుణం, సేవాభావం కేవలం డైలాగ్‌లకు మాత్రమే పరిమితం కాలేదు. ఆ పాత్ర తాలూకు ఆత్మ తన నిజ జీవితాన్ని బలంగా తాకిందని రష్మిక స్వయంగా వెల్లడించారు. ఆ స్ఫూర్తే ఇప్పుడు వందలాది నిరుపేద కుటుంబాలకు కొండంత అండగా నిలవడానికి ప్రధాన కారణమైంది.

ప్రాజెక్ట్ అన్నపూర్ణ: ఆకలి తీర్చే అన్నాదాతలుగా..
సమాజంలో అత్యంత దయనీయ స్థితిలో ఉన్న, ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న వర్గాలను ఆదుకోవడమే లక్ష్యంగా ఈ జంట 'ప్రాజెక్ట్ అన్నపూర్ణ(Project Annapoorna)' అనే బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. తొలి దశలో ఎంపిక చేసిన 400 పేద కుటుంబాలకు మూడు నెలల పాటు ఉచితంగా పౌష్టికాహారం, నిత్యావసర సరుకులను అందించనున్నారు. కేవలం ఒక ప్రాంతానికి పరిమితం కాకుండా హైదరాబాద్, విజయవాడ, అనంతపురం, మహబూబ్‌నగర్, బెంగళూరు, చెన్నై, కొచ్చి, కొడగు వంటి దక్షిణ భారతదేశంలోని పలు ప్రధాన నగరాల్లోని అర్హులైన పేదలకు ఈ సాయం చేరువవుతోంది. అంతేకాదు, ప్రతి త్రైమాసికానికి లబ్ధిదారులైన కుటుంబాలను మారుస్తూ, రాబోయే ఏడాది పొడవునా ఈ యజ్ఞాన్ని నిరంతరాయంగా కొనసాగించాలని వారు లక్ష్యంగా పెట్టుకోవడం విశేషం.

ఈ సాయం వెనుక కేవలం ఆకలి తీర్చడం మాత్రమే కాదు, ఒక లోతైన ఆలోచన కూడా ఉంది. పేదరికంలో మగ్గిపోతున్న కుటుంబాలు నిత్యావసర సరుకుల కోసం ప్రతినెలా కష్టపడి సంపాదించిన డబ్బును ఖర్చు చేయాల్సి వస్తుంది. ఇప్పుడు ఆ భారాన్ని విజయ్-రష్మిక తమ భుజాన వేసుకోవడంతో, ఆ కుటుంబాలు నిత్యావసరాల కోసం వెచ్చించే మొత్తాన్ని ఆదా చేసుకునే అవకాశం లభిస్తుంది. అలా మిగిలిన డబ్బును వారి పిల్లల ఉన్నత చదువులకో లేక అత్యవసర వైద్య ఖర్చులకో వినియోగించుకోవాలన్నదే ఈ స్టార్ కపుల్ ప్రధాన ఉద్దేశం. గతంలో తాము చేసిన ఎన్నో సహాయాలను గోప్యంగా ఉంచినప్పటికీ, మంచి ఇతరులకు పాకాలని, మరికొందరిలో స్ఫూర్తిని నింపాలనే సదుద్దేశంతోనే ఇప్పుడు దీనిని బహిరంగంగా పంచుకున్నట్లు వారు తెలిపారు. ఏదేమైనా 'రణబాలి' సినిమాతో బాక్సాఫీస్ వద్దే కాదు, అభాగ్యుల గుండెల్లోనూ విజయ్-రష్మిక(Vijay-Rashmika) శాశ్వత స్థానం సంపాదించుకుంటున్నారనడంలో ఎలాంటి సందేహం లేదు.

Tags
Vijay Deverakonda Rashmika Mandanna Ranabaali Project Annapoorna Virosh Tollywood Telugu Cinema
Recent Comments
Leave a Comment

Related News

Latest News