చింత‌మ‌నేనికి చంద్ర‌బాబు అక్షింత‌లు!

admin
Published by Admin — February 15, 2025 in Politics, Andhra
News Image

దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కి ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు అక్షింత‌లు వేశారు. బుధ‌వారం రాత్రి ఏలూరు జిల్లా వ‌ట్లూరులో ఓ వివాహ కార్యక్రమానికి ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, వైసీపీ మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి హాజ‌రు అయ్యారు. అయితే ఫంక్ష‌న్ హాల్ కారిడార్ లో చింత‌మేని కారుకు అబ్బయ్య చౌదరి కారు అడ్డు పెట్ట‌డ‌మే కాక దౌర్జన్యం చేయ‌డంతో వాగ్వాదం చోటుచేసుకుంది. స‌హ‌నం కోల్పోయిన చింత‌మనేని అబ్బ‌య్య చౌద‌రి డ్రైవ‌ర్ పై బూత‌ల‌తో రెచ్చిపోయారు.

ఇందుకు సంబంధించిన వీడియోను వైసీపీ సోష‌ల్ మీడియాలో పెట్టి చింత‌మ‌నేనిని గ‌ట్టిగా ట్రోల్ చేసింది. అయితే పథకం ప్రకారమే వైసీపీ నేతలు కారు అడ్డుపెట్టి గొడ‌వ చేశార‌ని.. ఒక్క‌సారిగా వైసీపీ రౌడీ మూక వ‌చ్చి దాడి చేసి హత్యాయత్నానికి పాల్ప‌డ్డార‌ని చింత‌మ‌నేని మండిప‌డ్డారు. ఈ ఘ‌ట‌న‌లో అబ్బయ్య చౌదరిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ సెక్షన్‌తో పాటు పలు సెక్షన్ల కింద ఏలూరు త్రీ టౌన్ పీఎస్‌లో కేసు కూడా న‌మోదు అయింది.

ఈ వివాదంపై వివ‌ర‌ణ ఇచ్చేందుకు చింత‌మ‌నేని శుక్ర‌వారం మంగళగిరి టీడీపీ ఆఫీసుకు వచ్చారు. అయితే చింతమనేని దుర్భాషల వీడియోపై చంద్ర‌బాబు అస‌హ‌నం వ్య‌క్తం చేశారు. మనం అధికారంలో ఉన్నామ‌ని గుర్తుంచుకోవాలని.. సహనంతో వ్యవహరించాలని.. ఇలా మాట్లాడితే ఎలా? అంటూ ముఖ్య‌మంత్రి ఫైర్ అయ్యారు. త‌ప్పును ఎత్తిచూప‌డానికి చాలా మార్గాలు ఉన్నాయ‌ని.. ఇలా సహనం కోల్పోయి వ్యవహరించడం తగదని చింత‌మ‌నేనికి అక్షింత‌లు వేశారు. ఇక‌పై ఇలాంటివి జరగకుండా చూసుకోవాలని చంద్ర‌బాబు హిత‌వు ప‌లికారు.

Tags
Andhra Pradesh ap politics chintamaneni prabhakar
Recent Comments
Leave a Comment

Related News