వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి విడదల రజనీ కి ఏపీ హైకోర్టు షాకిచ్చింది. తనపైనా.. తన వ్యక్తిగత సహాయకులపైనా నమోదైన కేసులను కొట్టి వేసేలా ఆదేశించాలని కోరుతూ.. దాఖలైన పిటిషన్లపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కేసులు కొట్టి వేయలేమని.. ఇలా కొట్టి వేస్తూ పోతే.. ఇక, కేసులు నమోదు చేయడం ఎందుకని విడదల రజనీ తాలూకు న్యాయవాదిని హైకోర్టు ప్రశ్నించింది. అంతేకాదు.. ఈ కేసు విచారణ జరిగితే మంచిదే కదా? మీతప్పులేనప్పుడు మీరు నిర్భయంగా నిజాయితీగా బయటకు వచ్చే అవకాశం ఉంటుందని వ్యాఖ్యినించింది.
అయితే.. తదుపరి నిర్ణయం తీసుకునే వరకు ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవద్దని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. ఇక, కేసు కొట్టి వేయాలని విడదల రజనీ తరఫున న్యాయవాది పదే పదే కోరినా కోర్టు మాత్రం నిర్ణయం వెలువరించలేదు. కాగా.. ఉమ్మడి గుంటూరు జి్ల్లాలోని చిలకలూరి పేట నియోజకవర్గం టీడీపీ ఇంచార్జ్ పిల్లి కోటిని ఓ కేసులో అరెస్టు చేసిన అప్పటి సీఐ సూర్యనా రాయణ తీవ్రంగా హింసించినట్టు కోటి చెబుతున్నారు. ఈ దృశ్యాలను వీడియో కాల్‌లో అప్పటి మంత్రి విడదల రజనీకి చూపించారని.. దీనిపై చర్యలు తీసుకోవాలని పిల్లి కోటి.. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫిర్యాదు చేశారు.
దీనిపై ఇటీవల కేసు నమోదు చేసిన పోలీసులు.. విడదల రజనీ సహా ఆమె పీఏలు.. ఫణీంద్ర, రామకృష్ణలపై కూడా కేసులు పెట్టారు. ఆ వెంటనే.. విడదల రజనీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరారు. దీనిపై విచా రణ కొనసాగుతున్న సమయంలోనే క్వాష్ పిటిషన్ కూడా దాఖలు చేశారు. ఈ రెండు పిటిషన్లపై వేర్వేరుగా విచారణ జరిపిన కోర్టు.. ముందస్తు బెయిల్ పై విచారణను ఈ నెల 24వ తేదీకి వాయిదా వేసింది. ఇక, కేసులు కొట్టివేయాలన్న పిటిషన్‌పై మాత్రం సుదీర్ఘంగా విచారణ జరిపిన న్యాయమూర్తి.. కేసులు కొట్టివేయలేమన్నారు. అయితే.. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు రజనీ సహా ఆమె పీఏలపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోరాదని పోలీసులను ఆదేశించారు.