ఏపీ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. బిగ్ బ్లాస్ట్ అంటూ తాజాగా విపక్ష వైసీపీ తన అధికారిక ఎక్స్ ఖాతా ద్వారా పెట్టిన ట్వీట్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. `ఈరోజు సాయంత్రం 7 గంటలకు బిగ్ బ్లాస్ట్.. గన్నవరం కేసు వెనుక అసలు నిజం బట్టబయలు అవుతుంది. ఒక అతిపెద్ద రహస్యం బట్టబయలు కాబోతోంది` అంటూ వైసీపీ ట్వీట్ చేసింది.
దీంతో ఈరోజు రాత్రి 7 గంటలకు ఏం జరగనుంది? వైసీపీ ఏం రివీల్ చేయబోతుంది? అన్న చర్చలు ఊపందుకున్నాయి. కాగా, గన్నవరం టీడీపీ ఆఫీసుపై జరిగిన దాడి కేసులో ఫిర్యాదుదారుడు గా ఉన్న సత్య వర్ధన్ ను కిడ్నాప్ చేసి బెదిరింపులకు పాల్పడిన వ్యవహారంలో మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీ అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. నిజానికి టీడీపీ ఆఫీసు దాడి కేసులో ముందస్తు బెయిల్ తెచ్చుకున్న వంశీ.. స్వయంగా వచ్చి చిక్కుల్లో పడ్డారు.
ఫిర్యాదుదారుడు సత్యవర్ధన్ ను కిడ్నాప్ చేసి బెదిరించి కేస్ విత్ డ్రా చేయించారు. అయితే సత్యవర్ధన్ వంశీకి దిమ్మతిరిగే షాక్ ఇచ్చాడు. తనను అపహరించి బెదిరించి తప్పుడు అఫిడవిట్ ఇచ్చేలా చేశారంటూ వంశీపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాడు సత్యవర్ధన్. దాంతో పోలీసులు వంశీని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం విజయవాడ జైలులో ఉన్న వంశీ బెయిల్ కోసం తిప్పలు పడుతున్నారు. ఇకపోతే తాజాగా వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జైలులో వల్లభనేని వంశీతో ములాఖత్ అయ్యారు.