కేసీఆర్‌కు సిట్ షాక్.. ఫోన్ ట్యాపింగ్ కేసులో నోటీసులు!

admin
Published by Admin — January 29, 2026 in Politics, Telangana
News Image

హైదరాబాద్: తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసు కీలక మలుపు తిరిగింది. గత కొంతకాలంగా స్తబ్దుగా ఉన్న ఈ కేసులో సిట్ అధికారులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు నోటీసులు ఇచ్చేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ఇప్పటికే ఈ వ్యవహారంలో కీలక అధికారుల అరెస్టులు, మాజీ మంత్రుల విచారణ పూర్తి కావడంతో, ఇప్పుడు నేరుగా గులాబీ బాస్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది.

ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో విచారణ?
విశ్వసనీయ సమాచారం ప్రకారం.. రేపు (శుక్రవారం) సిట్ అధికారులు గజ్వేల్ నియోజకవర్గంలోని ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌కు వెళ్లనున్నారు. అక్కడే కేసీఆర్‌కు అధికారికంగా నోటీసులు అందజేసి, అనంతరం ఆయన వాంగ్మూలాన్ని నమోదు చేసే అవకాశం ఉంది. గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కేసీఆర్ ఆదేశాలతోనే జరిగిందా? లేక ఆయనకు తెలియకుండానే అధికారులు ఈ పని చేశారా? అనే కోణంలో సిట్ ప్రశ్నలు సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.

ఈ కేసు తుది అంకానికి చేరుకుందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. సిట్ అధికారులు ఇప్పటికే మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావుతో పాటు మాజీ ఎంపీ సంతోష్ రావును సుదీర్ఘంగా విచారించారు. వారు ఇచ్చిన సమాచారం ఆధారంగానే కేసీఆర్‌ను విచారించాలని నిర్ణయించినట్లు సమాచారం. ముఖ్యంగా సిట్ బాధ్యతలను సిపి సజ్జనార్ చేపట్టిన తర్వాత విచారణ వేగం పుంజుకోవడం, సాక్ష్యాధారాల సేకరణ పక్కాగా సాగడం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే, సిట్ నోటీసులపై కేసీఆర్ ఎలా స్పందిస్తారనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. ఆయన విచారణకు సహకరిస్తారా? లేదా తన ఆరోగ్యం దృష్ట్యా మినహాయింపు కోరతారా? అనే ఉత్కంఠ నెలకొంది.

Tags
KCR SIT Notice Phone Tapping Case Telangana Politics BRS KCR Farmhouse
Recent Comments
Leave a Comment

Related News