పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నుంచి ఒక సినిమా వస్తుందంటే అంచనాలు ఆకాశంలో ఉంటాయి. గత కొంతకాలంగా సీరియస్ రోల్స్ చేస్తున్న ప్రభాస్, ఈసారి మారుతి దర్శకత్వంలో హారర్ రొమాంటిక్ కామెడీ జానర్‌ను ఎంచుకోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. భారీ హైప్ మధ్య ఈరోజు విడుదలైన `ది రాజా సాబ్` ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో చూద్దాం.
కథ: రాజు (ప్రభాస్) తన నానమ్మ గంగమ్మ (జరీనా వహాబ్) సంరక్షణలో పెరుగుతాడు. అల్జీమర్స్ వ్యాధితో బాధపడే గంగమ్మ, తన భర్త పెకమేడల కనకరాజు (సంజయ్ దత్) కోసం నిరంతరం ఎదురుచూస్తుంటుంది. తన తాత కోసం రాజు చేసే వెతుకులాట అతడిని హైదరాబాద్‌కు చేరుస్తుంది. అయితే కనకరాజు ఎప్పుడో చనిపోయాడని, ఒక ప్రమాదకరమైన ఆత్మగా మారాడనే నిజం రాజుకు తెలుస్తుంది. తన తాత గతానికి, అతడి దురాశకు గల కారణాలను వెతికే క్రమంలో రాజు ఎదుర్కొన్న సవాళ్లే ఈ చిత్ర కథ.
సినిమా అంతా ప్రభాస్ భుజాల మీదనే నడుస్తుంది. వింటేజ్ ప్రభాస్‌ను గుర్తుకు తెచ్చేలా ఆయన మేనరిజమ్స్, కామెడీ టైమింగ్, మరియు స్క్రీన్ ప్రెజెన్స్ అద్భుతంగా ఉన్నాయి. ముఖ్యంగా సెకండ్ హాఫ్‌లో వచ్చే కొన్ని ఎమోషనల్ సీన్స్‌లోనూ, హారర్ ఎలిమెంట్స్ ఎదురైనప్పుడు ప్రభాస్ చూపించిన రియాక్షన్స్ సినిమాకు మెయిన్ పిల్లర్ అని చెప్పొచ్చు. సంజయ్ దత్ - ప్రభాస్ మధ్య వచ్చే సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. ప్రభాస్‌తో కలిసి సత్య పండించిన కామెడీ కొన్ని చోట్ల థియేటర్లలో నవ్వులు పూయిస్తుంది. అలాగే నానమ్మ, మనవడి మధ్య ఉండే సెంటిమెంట్ పర్వాలేదనిపిస్తుంది.
అదే పెద్ద మైనస్ అయ్యిందా..?
అయితే ప్రభాస్ అనే భారీ ఇమేజ్ ఉన్న నటుడిని పెట్టుకున్నప్పుడు, దర్శకుడు మారుతి ఆయన చుట్టూ బలమైన కథను అల్లుకోవడంలో విఫలమయ్యారు. కథలో కొత్తదనం ఉన్నా, దాన్ని నడిపించడంలో మారుతి తడబడ్డారు. స్క్రీన్‌ప్లే ఆశించిన స్థాయిలో లేదు. ప్రభాస్ తన ఎనర్జీతో సీన్లను లేపడానికి ప్రయత్నిస్తుంటే, లాజిక్ లేని కథనం దాన్ని కిందకు పడేస్తుంటుంది. అలాగే ప్రభాస్ పాత్రను హైలైట్ చేసే క్రమంలో మిగిలిన పాత్రలను (హీరోయిన్లు, విలన్లు) పూర్తిగా గాలికి వదిలేశారు. ముగ్గురు హీరోయిన్లు ఉన్నా, ఎవరికీ సరైన ప్రాధాన్యత లేదు. వారు కేవలం పాటలకు, గ్లామర్‌కే పరిమితమయ్యారు. సినిమాకు మరో పెద్ద మైనస్ రన్‌టైమ్. దాదాపు 3 గంటల నిడివి ప్రేక్షకుడి సహనానికి పరీక్ష పెడుతుంది. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్‌లో చాలా సీన్లు సాగదీసినట్లు అనిపిస్తాయి.
నటీనటుల పనితీరు: ప్రభాస్ సినిమాలో వన్ మ్యాన్ షో చేశాడు. డ్యాన్స్, కామెడీ, యాక్షన్.. ఇలా అన్నింటిలోనూ తన మార్క్ చూపించారు. సంజయ్ దత్ తన గంభీరమైన నటనతో భయపెట్టారు. జరీనా వహాబ్ పాత్ర హుందాగా ఉంది. అయితే, మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ పాత్రలు కథకు ఏమాత్రం బలాన్ని ఇవ్వలేకపోయాయి. ఇతర కమెడియన్లు ఉన్నా, వారిని సరిగ్గా వాడుకోలేదు.
సాంకేతిక నిపుణుల పనితీరు: థమన్ అందించిన సంగీతంలో పాటలు యావరేజ్ గా ఉన్నా, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం కొన్ని చోట్ల అతిగా అనిపిస్తుంది. కార్తీక్ పళని సినిమాటోగ్రఫీ రిచ్‌గా ఉంది, విజువల్స్ గ్రాండ్‌గా ఉన్నాయి. ఎడిటింగ్ విషయంలో కోటగిరి వెంకటేశ్వరరావు ఇంకాస్త శ్రద్ధ పెట్టాల్సింది. గ్రాఫిక్స్ నాణ్యత అక్కడక్కడ తక్కువగా అనిపిస్తుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.
ఫైనల్‌గా.. ప్రభాస్‌ను సరికొత్తగా చూడాలనుకునే ఫ్యాన్స్‌కు `రాజా సాబ్` ఒక విందు లాంటివాడే. కానీ, ఒక సినిమాగా చూస్తే మాత్రం కథలో లోపాలు, బలహీనమైన దర్శకత్వం నిరాశ పరుస్తాయి. ఒక్క మాటలో చెప్పాలంటే.. ``రాజు గారి ఆట బాగుంది.. కానీ ఆ వేటలో దమ్ము లేదు!``