సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ విదేశీ పర్యటనలపై వైసీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్న సంగతి తెలిసిందే. చంద్రబాబు, లోకేష్ లు రాష్ట్రాన్ని గాలికి వదిలేసి విదేశాల్లో సేద తీరుతున్నారంటూ వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆ వ్యాఖ్యలను ఏపీ లీడ్ క్యాప్ చైర్మన్ పిల్లి మాణిక్యాలరావు ఖండించారు. చంద్రబాబు, లోకేష్ కనిపించడం లేదని వైసీపీ సైకో బ్యాచ్ కావాలని తప్పుడు ప్రచారం చేస్తుందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రజా సమస్యలపై పోరాడే ధైర్యం లేక ఈ రకమైన విష ప్రచారంతో జగన్ రెడ్డి సైకో బ్యాచ్ సంతృప్తి పడుతుందని ఎద్దేవా చేశారు. చంద్రబాబు, పవన్, లోకేష్ లపై జగన్ కు ఉన్న ఫ్రస్టేషన్ కు ఇది నిదర్శనమని అన్నారు. వ్యక్తిగత దూషణలు, కుటుంబ సభ్యులపై నీచమైన వ్యాఖ్యలు చేసిన వైసీపీని ప్రజలు ఆల్రెడీ తిరస్కరించారని గుర్తు చేశారు.
75 ఏళ్ల వయసులోనూ ప్రతిరోజు 18 గంటల పాటు రాష్ట్రం కోసం కష్టపడుతున్న నేత చంద్రబాబు అని గుర్తు చేశారు. జగన్ విధ్వంసానికి కుదేలైన రాష్ట్రాన్ని గాడిన పెట్టేందుకు 18 నెలలుగా చంద్రబాబు బిజీగా ఉన్నారని అన్నారు. అటువంటి చంద్రబాబు నూతన సంవత్సరం సందర్భంగా నాలుగు రోజులు కుటుంబంతో గడిపేందుకు విదేశాలకు వెళితే దాన్ని కూడా వైసీపీ నేతలు తప్పుపడుతున్నారని మండిపడ్డారు. గతంలో జగన్ కూడా తన పిల్లలను కలిసేందుకు పలుమార్లు లండన్ వెళ్లిన విషయాన్ని గుర్తు చేశారు. దీంతో, జగన్ లండన్ టూర్లు మరిచిన వైసీపీ..ఇప్పుడు చంద్రబాబును విమర్శిస్తోందని సోషల్ మీడియాలో కామెంట్లు వస్తున్నాయి.