తెలంగాణ శాసనసభ శీతాకాల సమావేశాల సందర్భంగా ప్రధాని మోదీపై సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీ మైండ్ సెట్ మారాలని, ఆయన మైండ్ ను టెస్ట్ చేయించుకోవాలని ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. ఈ నేపథ్యంలోనే ఆ వ్యాఖ్యలను కేంద్రమంత్రి బండి సంజయ్ ఖండించారు. శాసనసభలో ఇటువంటి మాటలకు స్థానం లేదని, ఇటువంటి బాధ్యత లేని అసభ్యకరమైన భాష వల్లే కమ్యూనిస్టులు ప్రాభవం కోల్పోయారని విమర్శించారు.
ఇక, తెలంగాణ అసెంబ్లీలో ఈ తరహా వ్యాఖ్యలను స్పీకర్ అనుమతించడం, ఆ వ్యాఖ్యలపై నవ్వడం బాధాకరమన్నారు. మిత్రపక్షం కాబట్టి కూనమనేని వ్యాఖ్యలను స్పీకర్ ఖండించలేదన్నారు. ప్రజాస్వామ్య విలువలను కాపాడాల్సిన బాధ్యతను కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరించిందన్నారు. మిత్రపక్షాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తుందని విమర్శించారు. కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలు రాజకీయ దూషణలకే పరిమితమయ్యాయని, అందుకే ప్రజల విశ్వాసాన్ని కోల్పోయాయని చెప్పారు. కూనంనేని తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని, దేశ ప్రజలకు, ప్రధాని మోదీకి ఆయన క్షమాపణ చెప్పాల్సిందేనని బండి సంజయ్ డిమాండ్ చేశారు.