సినీ రంగానికి.. నాటక రంగానికి తలమానికమైన అవార్డు.. నంది పురస్కారం. బంగారు నంది.. వెండి నం దులను అందుకోవడం అంటే.. కళాకారులు ఎంతో సమున్నతంగా భావిస్తారు. అయితే.. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు తర్వాత.. నంది అవార్డులను ఇరు రాష్ట్రాలుకూడా పట్టించుకోలేదు. తెలంగాణ లో ఇటీవ ల `గద్దర్` అవార్డులను ప్రారంభించారు. కానీ.. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న పదేళ్లలో ఏనాడూ.. అవార్డుల జోలికి పోలేదు.
ఇక, ఏపీలో ఉన్న ఆర్థిక పరిస్థితులు.. రాజధాని ఏర్పాటు పనులు.. వంటి కారణంగా.. ఇక్కడ కూడా 2014 నుంచి ఎలాంటి నంది అవార్డులు కానీ.. ఇతరత్రా ప్రోత్సాహకాలు కానీ.. కళాకారులకు లభించలేదు. వైసీపీ హయాంలో నాటక రంగానికి ప్రోత్సహాం ఇచ్చినా.. సినిమా రంగాన్ని మాత్రం పూర్తిగా పక్కన పెట్టారు. తాజాగా కూటమి సర్కారు వచ్చాక.. డిప్యూటీ సీఎంగా పవన్ కల్యాణ్ బాధ్యతలు చేపట్టాక.. కళాకారులకు మరోసారి ఈ అవార్డులపై ఆశరేగింది.
కొన్నాళ్ల కిందట.. సినీ రంగానికి చెందిన ప్రముఖులు.. పవన్ కల్యాణ్‌ను కలిసినప్పుడు.. అవార్డుల విష యాన్ని కూడా ప్రస్తావించారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ వ్యవహారంపై ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ కీలక ప్రకటన చేశారు. వచ్చే ఏడాది నుంచి సినీ రంగానికి నంది అవార్డులు ఇవ్వనున్న ట్టు తెలిపారు. దీనిపై కసరత్తు చేస్తున్నామన్నారు. సీఎం చంద్రబాబు కూడా.. నంది అవార్డుల ప్రదానం.. ఎంపిక విషయంపై తరచుగా ప్రస్తావిస్తున్నట్టు దుర్గేష్ తెలిపారు.
బడ్జెట్‌ను బట్టి సినిమాలకు..
ఇక, సినిమాలకు ఇచ్చే వినోదపు పన్ను రాయితీ.. టికెట్ ధరలు పెంచుకునేవెసులుబాటు విషయంలో ఆయా సినిమాల బడ్జెట్‌ను బట్టి నిర్ణయం తీసుకోనున్నట్టు కందుల తెలిపారు. అయితే.. ఈ బడ్జెట్ విష యంలో ఎలా నిర్ణయానికి రావాలన్నదే సమస్యగా ఉందని, దీనిపై చర్చిస్తున్నట్టు చెప్పారు. సినిమా నిర్మాణానికి అయిన వ్యయాన్ని బడ్జట్‌గా నిర్ణయించాలని ప్రతిపాదిస్తున్నట్టు చెప్పారు. అయితే.. హీరోలు, నిపుణులకు ఇచ్చే వేతనాలను పరిగణనలోకి తీసుకోవాలన్న డిమాండ్ కూడా ఉందని తెలిపారు.