మీ మీ నియోజకవర్గాల్లోని అనేక పంచాయతీల్లో మీ మాటను కాదని.. రెబల్స్ ఎలా తయారయ్యారు. మీపై వారికి విశ్వాసం లేదా? పార్టీ లైన్‌ను ఎందుకు అతిక్రమించారు`` అంటూ.. సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలపై అసహనం, ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో తాజాగా జరిగిన పంచాయతీ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలను కాంగ్రెస్ పార్టీ మద్దతు దారులుగా రంగంలోకి దిగిన అభ్యర్థులు కైవసం చేసుకున్నారు. అయితే.. ఇదేసమయంలో కొందరు రెబల్స్ కూడా బరిలోకి దిగారు. వీరు కూడా విజయం దక్కించుకున్నారు.
మొత్తంగా 808 మంది రెబల్స్ విజయం సాధించారు. అయితే.. వాస్తవానికి అక్కడ పార్టీ అధికారికంగా మద్దతు ఇచ్చిన అభ్య ర్థులు మాత్రం పరాజయం పాలయ్యారు. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. తాజాగా పార్టీ ఇంచార్జులు, ఎమ్మెల్యేలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎమ్మెల్యేల వైఖరిపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. ``మీకు తెలియకుండానే రెబల్స్ వచ్చారా? లేక తెలిసే వారు పోటీకి దిగారా?`` అని నిలదీశారు. ఇది పార్టీ లైన్‌కు సిద్ధాంతాలకు కూడా వ్యతిరేకమని సీఎం వ్యాఖ్యానించారు. గెలవాల్సిన స్థానాల్లో ఎందుకు ఓడారని కూడా నిలదీశారు.
దాదాపు 16 అసెంబ్లీ నియోజకవర్గాల్లో రెబల్స్ బరిలో నిలవడం.. విజయం దక్కించుకోవడం చిన్న విషయం కాదని సీఎం రేవంత్ రెడ్డి, పార్టీ పీసీసీ చీఫ్ మహేష్‌కుమార్ గౌడ్ కూడా అసహనం వ్యక్తం చేశారు. దీనిని లైట్‌గా తీసుకునేది లేదన్నారు. ``రెబల్స్ బరిలో ఉన్న విషయం తెలిసిన వెంటనే వారిని ఎందుకు బుజ్జగించలేదు. వారిని పోటీ నుంచి తప్పించే ప్రయత్నం ఎందుకు చేయలేదు`` అని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఇదేసమయంలో ఎమ్మెల్యే బంధవులు కూడా కొందరు రంగంలోకి దిగి పోటీ చేయడాన్ని ప్రశ్నించారు. ఈ విషయాన్ని పార్టీకి ఎందుకు చెప్పలేదన్నారు.
పార్టీ లైన్ సహా.. నాయకుల మాటకు విలువ లేకుండా వ్యవహరించడాన్ని తప్పుబట్టారు. 16 మంది ఎమ్మెల్యేలు.. తగిన వివరణతో గాంధీభవన్‌కు రావాల్సి ఉంటుందని మహేష్‌కుమార్ గౌడ్ సూచించారు. సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. పార్టీలో అందరూ సమన్వయంగా ఉండాలని.. పార్టీలైన్ ప్రకారం వ్యవహరించాలని పదే పదే చెబుతున్నా.. ఎందుకు వినిపించుకోవడం లేదన్నారు. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకుంటున్నామన్నారు. ఇలాంటికార్యక్రమాల ద్వారా పార్టీకి తీరనినష్టం చేకూరుతుందన్నారు. దీనికి ఎవరు బాధ్యత వహిస్తారని సీఎం ప్రశ్నించారు.