ప్రపంచంలో ఏ మూల చోటు చేసుకునే ఉగ్ర ఘటనల వెనుక దాయాది పాక్ హస్తం ఉండటం లేదంటే పాకిస్థాన్ లింకులు ఉండటం ఈ మధ్యన ఎక్కువ అవుతోంది. ఇది సరిపోదన్నట్లుగా పాక్ బిచ్చగాళ్లు విదేశాల్లో చేస్తున్న రచ్చతో ఆ దేవ ప్రతిష్ఠకు భారీగా భంగం వాటిల్లుతున్న పరిస్థితి. వేలాది మంది పాకిస్థానీ పౌరులు విదేశాల్లో నేరాలు.. బిక్షాటన చేస్తున్న వైనంతో పలు దేశాలు తీవ్ర ఇబ్బందిని ఎదుర్కొంటున్నాయి. తాజాగా తమ దేశంలోని పాక్ బిచ్చగాళ్లపై సౌదీ అరేబియా కొరడా ఝుళిపించింది.
గత ఏడాది 35 వేల మంది పాకిస్థానీ బిచ్చగాళ్లను వారి దేశానికి తిప్పి పంపిన సౌదీ.. ఈ ఏడాది ఆ సంఖ్య మరింత పెరిగింది. తాజా అంచనాల ప్రకారం ఈ ఏడాదిలో అక్రమ వలసలు.. భిక్షాటన నిర్మూలనలో భాగంగా 66,154 మంది పాక్ పౌరుల్ని వారి దేశానికి పంపేసిన వైనాన్ని ఉటంకిస్తూ రిపోర్టు బయటకు వచ్చింది. భిక్షాటన కోసం తమ దేశానికి పెద్ద ఎత్తున వస్తున్న పాక్ బిచ్చగాళ్లపై సౌదీ..యూఏఈలో కొరడా ఝుళిపిస్తున్నాయి.
పాక్ నుంచి అక్రమ వలసలు కేవలం గల్ఫ్ దేశాలకు మాత్రమే పరిమితం కాలేదని.. ఆఫ్రికా.. ఐరోపా దేశాలతో పాటు కాంబోడియా.. థాయ్ లాండ్ లాంటి దేశాల్ని వెంటాడుతోంది. ఈ దేశాలకు పర్యాటక వీసాలపై వస్తున్న పాక్ బిచ్చగాళ్లు.. తమ పర్యాటక వీసాల్ని దుర్వినియోగానికి పాల్పడుతున్నట్లుగా చెబుతున్నారు. ఇప్పటివరకు ఒక్క సౌదీ అరేబియానే 56 వేల మంది పాక్ బిచ్చగాళ్లను బహిష్కరించిందంటూ పాకిస్థాన్ ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ డైరెక్టర్ జనరల్ రిఫాత్ ముఖ్తార్ వివరాల్ని వెల్లడించారు.
భిక్షాటన ఆరోపణలతో ఈ ఏడాది ఇప్పటివరకు 24 వేల మంది పాక్ పౌరుల్ని సౌదీ బహిష్కరిస్తే.. దుబాయ్ 6 వేల మంది. అజర్ బైజాన్ 2500 మందిని వెనక్కి పంపారన్నారు. ఇక.. కాంబోడియాకు 24 వేల మంది పాకిస్థానీయులు వెళ్లగా.. అందులో సగం మాత్రమే తిరిగి స్వదేశానికి చేరుకున్నట్లుగా పేర్కొన్నారు. అంతేకాదు.. మయన్మార్ కు వెళ్లిన 4 వేల మంది పాక్ టూరిస్టుల్లోనూ 250 మంది తిరిగి రాలేదని పేర్కొన్నారు.
విదేశాల్లోని పవిత్ర స్థలాల్లో అరెస్టు అవుతున్న బిచ్చగాళ్లలో పాకిస్థానీయుల సంఖ్య 90 శాతం ఉండటం గమనార్హం.
అంతేకాదు.. విదేశాల్లోని పవిత్రస్థలాల్లోని జేబుదొంగల్లోనూ అత్యధికంగా పాక్ జాతీయులేనని పేర్కొన్న తీరు చూస్తే.. ప్రపంచంలో పాక్ పరువు మంటకలిపేలా ఆ దేశ బిచ్చగాళ్లు వ్యవహరిస్తున్నట్లుగా చెప్పాలి. ఈ కారణంగానే పాకిస్థాన్ పౌరులకు యూఏఈ వీసాల జారీని నిలిపివేయటం తెలిసిందే. చూస్తుంటే.. పాకిస్థానీయులు అన్న ట్యాగ్ కు పలు దేశాలు దూరం పెట్టేసే ప్రమాదం పొంచి ఉందని చెప్పక తప్పదు.