ఏపీ రాజధాని అమరావతి వ్యవహారం మరోసారి చర్చనీయాంశంగా మారింది. దేశంలోని ఏ రాష్ట్రంలో ఉన్న రాజధానికీ లేని విధంగా అమరావతి వివాదంలో చిక్కుకున్న విషయం తెలిసిందే. ఈ రాజధానిని ఓకే అంటూనే వైసీపీ ప్రభుత్వం గతంలో పక్కన పెట్టేసి మూడు రాజధానులు అంటూ మెలిక పెట్టింది. దీంతో భూములు ఇచ్చిన రైతులు ఉద్యమాలకు దిగారు. మొత్తానికి గత ఎన్నికల్లో ప్రజా తీర్పు తో వైసీపీ ప్రభుత్వం పడిపోయినా.. మళ్లీ అదే ప్రభుత్వం వస్తే.. తమ పరిస్థితి ఏంటి? రాజధాని పరిస్థితి ఏంటనే చర్చ ఉంది.
ఈ నేపథ్యంలోనే అమరావతికి చట్టబద్ధత కల్పించాలని రైతులు, మేధావులు కూడా ప్రస్తుత కూటమి స ర్కారుకు సూచించారు. దీంతో ఎట్టకేలకు.. ప్రభుత్వం కొన్నాళ్ల కిందట బిల్లును రూపొందించి.. కేంద్రానికి పంపించింది. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంటు శీతాకాల సమావేశాల్లోనే దీనిని ఆమోదించాలని కూడా కోరింది. దీంతో కేంద్రం కూడా సదరు బిల్లును పరిశీలించిందని, న్యాయశాఖ కూడా దీనికి ఓకే చెప్పింద ని.. గత వారం వార్తలు వచ్చాయి. కానీ.. ఇంతలోనే కేంద్రం యూటర్న్ తీసుకున్నట్టు జాతీయ మీడియా పేర్కొంది.
ప్రస్తుతం రాజధాని బిల్లును కేంద్రం తిరిగి రాష్ట్రానికి పంపించినట్టు జాతీయ మీడియా పేర్కొంది. మరో సారి పరిశీలించి.. మార్పులు చేయాలని పేర్కొనట్టుగా తెలిపింది. దీంతో ప్రస్తుతం జరుగుతున్న శీతాకాల సమావేశాల్లో ఈ బిల్లు పార్లమెంటుకు చేరుతుందా? అనేది సందేహంగా మారింది. మరోవైపు.. కేంద్రం తిప్పి పంపించిన బిల్లు వ్యవహారంపై న్యాయనిపుణులతో సీఎం చంద్రబాబు చర్చిస్తున్నట్టు సమాచారం. కేంద్రం చెప్పినట్టుగా మార్పులు చేసి.. పంపుతారా? లేక వెయిట్ చేస్తారా? అనేది చూడాలి.
ఈ 4 కారణాలేనా?
1) రాష్ట్ర రాజధానికి సంబంధించిన బిల్లును ముందు అసెంబ్లీ ఆమోదించాలి. కానీ.. అలా చేయలేదు. ఇప్పుడు అసెంబ్లీలో ఆమోదించాలి.
2) 2014 నుంచి రాజధాని అమరావతిగా గుర్తించాలని రాష్ట్రం కోరింది. కానీ, 2024 వరకు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉన్న నేపథ్యంలో 2024 తర్వాతే దానిని రాజధానిగా గుర్తింస్తామని కేంద్రం చెబుతోంది.
3) రాజధాని సరిహద్దులు నిర్ణయించుకుండా బిల్లును రూపొందించడంపై కూడా కేంద్రం విస్మయం వ్యక్తం చేసింది. కానీ, ప్రస్తుతం రాజధానిని మరో 46 వేల ఎకరాలకు విస్తరించాలని రాష్ట్రం భావిస్తోంది. ఈ ప్రక్రియ కొలిక్కిరాలేదు.
4) రాజధాని నిర్మాణ వ్యయాన్ని కూడా బిల్లులో పేర్కొనాలి. ఇది కూడా రాష్ట్రం చేయలేదు. ఈ నాలుగు ప్రధాన కారణాలతోనే కేంద్రం వెనక్కి పంపినట్టు ప్రచారం జరుగుతోంది.