ప్రతిష్టాత్మక తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి చైర్మన్ పదవిని చేపట్టిన మీడియా అధిపతి బీఆర్ నాయుడు ఏడాది పూర్తి చేసుకున్నారు. 2024లో కూటమి ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత.. బీఆర్ నాయుడుకు ఈ పదవి వరించింది. అనేక మంది పోటీలో ఉన్నప్పటికీ.. సీఎం చంద్రబాబు నేతృత్వంలోని మంత్రివర్గం.. నాయుడి వైపే అనుకూలంగా నిర్ణయం తీసుకుంది. ఇక, ఈ ఏడాది కాలంలో నాయుడు తనదైన శైలిలో తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ప్రజలకు చేరువ చేశారు. చిన్నపాటి ఘట నలు ఉన్నప్పటికీ.. మొత్తంగా ఏడాది కాలంలో సంచలన నిర్ణయాలు.. అదేసమయంలో మార్పులకు కూడా శ్రీకారం చుట్టారు.
ప్రధానంగా.. తిరుమలలో అన్యమస్థుల ప్రచారం.. ఎక్కువగా ఉందన్న విమర్శల నేపథ్యంలో దీనిపై కీలక నిర్ణయం తీసుకు న్నారు. ఈ క్రమంలోనే తిరుమలలో పనిచేస్తున్న అన్య మతస్తులను వేరే విభాగాలకు పంపించారు. అదేవిధంగా మరిన్ని ఎక్కువ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయించి.. భద్రతను పటిష్టం చేశారు. అలాగే.. గతంలో నాణ్యత లోపం ఉందన్న విమర్శలు వచ్చిన నేపథ్యంలో తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం విషయంలో కఠిన చర్యలు తీసుకున్నారు. నాణ్యత లోపం లేకుండా వ్యవహరిస్తున్నారు. అదేవిధంగా లడ్డూకు వినియోగించే నెయ్యి కొనుగోలు ప్రక్రియను కూడా పారదర్శకం చేశారు.
ఇక, వెంగమాంబ అన్న ప్రసాదంలో కొత్తగా వడనుచేర్చారు. అదేవిదంగా భక్తుల సంఖ్యకు అనుగుణంగా భోజనాలను అందించే లా ఏర్పాటు చేశారు. గతంలో తిరుమలలో కాటేజీలు నిర్మించగా.. వాటికి ఆర్థిక సాయం చేసిన వారి పేర్లు పెట్టారు. వీటిని తొలగించి.. పూర్తిగా దేవదేవుడి పేర్లు పెట్టేలా చర్యలు తీసుకున్నారు. మరో కీలకమైన అంశం.. ఏఐ. ప్రస్తుతం ప్రపంచాన్ని ఊపేస్తున్న ఏఐ ద్వారా శ్రీవారి దర్శనాన్ని మరింతగా సాధారణ భక్తులకు చేరువ చేయాలని నిర్ణయించారు. అయితే.. కొన్ని ధార్మిక సంఘాలు.. దీనిని తప్పుబట్టడంతో ఆగింది. అయినా మరోసారి దీనిపై అధ్యయనం చేస్తున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానాల పరిధిలో ఉన్న అన్ని ఆలయాల్లోనూ నిత్య అన్నదానం చేస్తున్నారు. ఆయా విషయాలను ప్రస్తావించిన బీఆర్ నాయుడు.. మరింతగా తిరుమల అభివృద్దికి కృషి చేస్తామని చెప్పారు.
కొన్ని వివాదాలు..
అయితే.. ఈ ఏడాది కాలంలో తిరుమల చుట్టూ కొన్ని వివాదాలు కూడా ముసురుకున్నాయి. అప్పటిఈవో శ్యామలరావుకు, బీఆర్ నాయుడుకు మధ్య వివాదం తలెత్తడం దీనిలో ఒకటి. ఇక, వైకుంఠ ద్వార దర్శనం నేపథ్యంలో జరిగిన తొక్కిసలాట. పలువురు భక్తులు మృతి చెందడం. అలానే.. తిరుమలలో ఎంత కట్టడి చేసినా.. అన్యమత ప్రచారం ఆగకపోవడం. తిరుపతి గోశాలలో గోవుల మృతి. పరకామణి కేసు వ్యవహారంలో టీటీడీని హైకోర్టు తీవ్రంగా తప్పుబట్టడం.. వంటివి కూడా ఈ ఏడాదిలోనే చోటు చేసుకున్నాయి.