ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో అత్యంత బిజీ హీరోయిన్స్ లో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ఒకటి. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు తన సొగసుతో, సహజమైన అభినయంతో కోట్లాది అభిమానులను సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ.. ప్రస్తుతం `ది గర్ల్‌ఫ్రెండ్` ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఆ చిత్రం నవంబర్ 7న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ చిత్రంలో రష్మిక, దీక్షిత్ శెట్టి మెయిన్ లీడ్స్ గా యాక్ట్ చేశారు.
ప్రమోషన్ కార్యక్రమాల భాగంగా జగపతిబాబు హోస్ట్ చేస్తున్న ‘జయమ్ము నిశ్చయమ్మురా’ టాక్ షోలో రష్మిక పాల్గొని సందడి చేసింది. తన చిన్ననాటి స్కూల్ రోజుల జ్ఞాపకాలు, సరదా సంఘటనలు పంచుకుంటూ నవ్వులు పూయించింది. జగపతి బాబు అడిగిన అన్ని ప్రశ్నలకు తనదైన శైలిలో సమాధానాలు చెప్పి ఆకట్టుకుంది. ఈ క్రమంలోనే ది గర్ల్‌ఫ్రెండ్ టీజర్ పై జగపతిబాబు అడిగిన ప్రశ్నకు రష్మిక ఇచ్చిన సమాధానం అందరినీ ఆకట్టుకుంది.
“మగాళ్లకూ పీరియడ్స్ వస్తే బాగుండేది. అప్పుడు వాళ్లు కూడా ఆ నొప్పి, అసౌకర్యం, మూడ్ స్వింగ్స్ అన్నీ అనుభవిస్తారు. అప్పుడే మహిళలు ప్రతీ నెల ఎదుర్కొనే పరిస్థితి ఎంత కష్టమో అర్థం చేసుకుంటారు” అని రష్మిక బోల్డ్ కామెంట్స్ చేసింది. ఆ సమాధానం విన్న ఆడియెన్స్ నిలబడి చప్పట్లు కొట్టారు. జగపతిబాబు కూడా ఆమె మాటలను అభినందించారు. రష్మిక కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తన గ్లామర్ కంటే ఆలోచనలు ఎక్కువగా ఆకట్టుకునేలా మాట్లాడిన రష్మిక మందన్నా, మరోసారి ‘బ్యూటీ విత్ బ్రెయిన్’ అని నిరూపించుకుంది.