తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురించి ఎవరు మాట్లాడినా.. ఆయన చాలా షార్ప్‌గా స్పందిస్తారని.. మాటకు మాట.. అన్నట్టుగా తూటాలు పేలుస్తారని అంటారు. వాస్తవానికి ఆయన రాజకీయ జీవితాన్ని పరిశీలిస్తే.. ఇది నిజమేనని అనిపిస్తుంది. బీఆర్ ఎస్ నాయకులపై కానీ.. అధికారులపై కానీ.. ఆయన మాట్లాడే తీరు.. కఠినంగానే ఉంటుంది. షార్ప్ గానే ఉంటుంది. ఇక, ఇటీవల జరిగిన కొన్ని ఘటనలపై కూడా ఆయన అంతే పదునుగా వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రిగా ఆ మాత్రం మాట్లాడాలన్న వాదన కూడా వినిపించింది.
కానీ.. ఇంత ధైర్యంగా.. ఫటాఫట్ మాట్లాడే.. రేవంత్ రెడ్డి ఒక్కసారిగా మూగబోతే.. నోటి నుంచి మాటలే రాని పరిస్థితికి చేరిపోతే.. ఎలా ఉంటుంది?. ఊహించలేం కదా?! కానీ.. ఇది నిజంగానే జరిగింది. ఆయన నోటి నుంచి ఒక్క ముక్క కూడా రాలేదు. అంతా నిశ్శబ్దం.. ఎదుటి వారు చెప్పింది వినడం తప్ప.. తాను నోరు విప్పి మాట్లాలేకపోయారు. అంతేకాదు.. అప్పటి వరకు ఉన్న ముఖ కవళికలు కూడా మారిపోయాయి. ఉత్సాహం కూడా దాదాపు లేకుండా పోయింది. దీంతో 90 శాతం మౌనంగానే ఉండిపోయారు.
దీనికి కారణం?
మొంథా తుఫాను ప్రభావం కారణంగా కురిసిన భారీ వర్షాలతో పలు జిల్లాలు అతలాకుతలం అయ్యాయి. లక్షలాది ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. గోడౌన్ల వద్దకు చేర్చిన ధాన్యపు రాశులు కూడా కొట్టుకుపో యాయి. అంతేకాదు.. పలు చోట్ల కాలనీలకు కాలనీలు నిలువెత్తు నీటిలో తేలి ఆడాయి. సర్వస్వం కొట్టుకు పోయిన కుటుంబాలు కూడా ఉన్నాయి. చాలా చోట్ల రహదారులు తెగిపోయి.. వాగులు పొంగి.. ప్రజలు ఎక్కడికక్కడ ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ముఖ్యంగా రైతులు, పేదలకు తీవ్ర నష్టం వాటిల్లింది.
ఆయా విపత్కర పరిస్థితులపై ఇటు సోషల్ మీడియా.. అటు ప్రధాన మీడియాలో వచ్చిన వార్తల నేపథ్యం లో సీఎం రేవంత్ రెడ్డి క్షేత్రస్థాయిలో పర్యటించారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో మంత్రి పొన్నం ప్రభాకర్‌తో కలిసి ఏరియల్ సర్వే చేశారు. అనంతరం.. క్షేత్రస్థాయిలో బాధిత కుటుంబాలను కలుసుకున్నారు. అప్పటి వరకు ఎంతో కొంత ఉత్సాహంగా ఉన్న సీఎం రేవంత్ రెడ్డి బాధితులను కలుసుని వారి గోడు విన్నాక.. నష్టాన్ని స్వయంగా చూశాక.. విషణ్ణులై పోయారు.
నోట మాట పెగల్లేదు. ముఖంలోనూ ఆవేదన కొట్టుమిట్టాడింది. ఏం చెప్పాలో.. కూడా తెలియలేదు. మాటల మాంత్రికుడు మూగబోయినట్టు అయిపోయింది. అతి కష్టం మీద.. వారిని ఓదార్చారు. తక్షణమే ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఈ పరిణామాలను దగ్గరగా చూసిన కాంగ్రెస్ నాయకులు.. `సీఎం రేవంత్ రెడ్డి ఇంత సున్నిత మనస్కులా?`` అని చర్చించుకున్నారు.