కర్నూలులో నిర్వహించిన సూపర్ జీఎస్టీ-సూపర్ సేవింగ్స్ సభలో ప్రధాని మోదీపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రశంసలు కురిపించారు. ప్రధాని మోదీ ఒక కర్మయోగి అని, ఏ ఫలితం ఆశించకుండా దేశ సేవే పరమావధిగా పనిచేస్తున్న గొప్ప వ్యక్తి అని పవన్ కొనియాడారు. ప్రధాని మోదీ దేశాన్ని మాత్రమే కాదని, రెండు తరాలను నడుపుతున్నారని అన్నారు. దేశం తలెత్తి చూసే విధంగా ఆత్మనిర్భర్ భారత్ నినాదంతో ఆయను ముందుకు వెళుతున్నారని చెప్పారు.
మన దేశ జెండా ఎంత పౌరుషంగా ఉంటుందో చాటి చెప్పారని అన్నారు. దేశ పటాన్ని ప్రపంచపటంలో నిలబెట్టారని కితాబిచ్చారు. ఏపీలో ఎన్డీఏ కూటమి 15 ఏళ్లకు తక్కువ కాకుండా బలంగా ఉండాలని ఆకాంక్షించారు. చిన్నచిన్న ఇబ్బందులున్నా సరే తట్టుకుని నిలబడాలని కోరారు. ఒక తరం కోసం ఆలోచించే నాయకులు ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు అని, వారిద్దరి నాయకత్వంలో అందరం సమష్టిగా పనిచేస్తామని అన్నారు. భావి తరాల ఆకాంక్షలను ముందుకు తీసుకెళ్తామని పవన్ చెప్పారు.