జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు సంబంధించి ముందు నుంచి పక్కా ప్లాన్‌తో వ్యవహరిస్తున్న ప్రధాన ప్రతిపక్షం బీఆర్ ఎస్ తాజాగా తన పార్టీ అభ్యర్థి మాగంటి సునీతకు.. బీఫాం కూడా ఇచ్చేసింది. ఇప్పటి వరకు ప్రధాన పార్టీల్లో బీఫాం పంపిణీ చేసిన ఏకైక పార్టీ బీఆర్ ఎస్ కావడం విశేషం. ఎర్రవల్లిలోని మాజీ సీఎం కేసీఆర్ నివాసంలో మంగళవారం సాయంత్రం జరిగిన కార్యక్రమంలో పార్టీ కీలక నాయకుల సమక్షంలో మాగంటి సునీతకు కేసీఆర్ బీఫాం అందించారు. అదేసమయంలో ఎన్నికల ఖర్చుల కింద రూ.40 లక్షల చెక్కును కూడా ఆమెకు ఇచ్చారు. ఈ సందర్భంగా పలు కీలక సూచనలు చేశారు.
ఎన్నికల్లో ప్రత్యర్థి పార్టీల నాయకులు అనేక విమర్శలు చేస్తారని.. వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదని కేసీఆర్ వ్యాఖ్యా నించారు. పార్టీ సంపూర్ణంగా అండగా ఉంటుందని.. త్వరలోనే మహిళా నాయకులు కూడా నియోజకవర్గంలో పర్యటించి ప్రచారం చేస్తారని చెప్పారు. ప్రచారంలో ఎక్కడా నిరాశ చెందొద్దదని చెప్పారు. వాళ్లిలా అన్నారు.. వీళ్లిలా .. అన్నారు అని మనసులో పెట్టుకుంటే ప్రచారంలో వెనుకబడతామని సూచించారు. గతంలో తాను తెలంగాణ ఉద్యమం చేసినప్పుడు కూడా అనేక మంది తనను విమర్శించారని చెప్పారు. అయినా.. తాను ఎక్కడా వెనుకబడకుండా ముందుకు సాగినట్టు వివరించారు.
అనంతరం.. అందరికీ తేనీరు విందు ఇచ్చిన కేసీఆర్.. ఇప్పటికే పలు సర్వేలు వచ్చాయని.. ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమ వుతోందని చెప్పారు. ప్రభుత్వం చేస్తున్న బుల్‌డోజర్ వ్యవహారం ప్రజలకు తీవ్ర ఆగ్రహం తెప్పిస్తోందన్నారు. దీనిని బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని సూచించారు. ప్రజల మూడ్ కూడా సర్కారుకు తీవ్ర వ్యతిరేకంగా ఉందన్నారు. దీనిని మనవైపు తిప్పుకొనేందుకు ప్రయత్నం చేయాలని పేర్కొన్నారు. అందరూ కలిసి కట్టుగా సహాయం చేస్తారని తెలిపారు. మాగంటి గోపీ నాథ్ అందరికీ కావాల్సిన మనిషి అని పేర్కొన్నారు. పేదలు, ధనికులు అనే తేడా లేకుండా ఆయనకు అందరిలోనూ మంచి పేరుందన్నారు. గెలుపు తథ్యమని ఎవరు ఎన్ని చేసినా వారికి ఎలాంటి ఫలితం దక్కదని కేసీఆర్ చెప్పారు.