ప్రతిపక్ష హోదా దక్కకపోయినా సరే కూటమి ప్రభుత్వంపై వైసీపీ విష ప్రచారం మాత్రం ఆపడం లేదు. నంది అని అందరూ చెబుతున్నా...కాదు అని వైసీపీ నేతలు వాదిస్తున్నారు. తాజాగా విజయవాడలో నిర్వహించబోతోన్న ‘విజయవాడ ఉత్సవ్’ కార్యక్రమంపై కూడా వైసీపీ నానా యాగీ చేస్తోంది. విలువైన దేవాలయ భూములను కబ్జా చేసేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. గొల్లపూడిలోని శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయానికి చెందిన 39.99 ఎకరాల భూమిని లీజు పేరుతో కొట్టేయాలని చూస్తోందని మాజీ మంత్రి పేర్ని నాని ఆరోపిస్తున్నారు.
ఈ క్రమంలోనే పేర్ని నాని ఆరోపణలకు టీడీపీ సీనియర్ నేత బుద్ధా వెంకన్న కౌంటర్ ఇచ్చారు. ఆ ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని ఆయన కొట్టిపారేశారు. ఉత్సవాలను అడ్డుకోవాలనే దురుద్దేశంతోనే దేవినేని అవినాశ్, వెల్లంపల్లి శ్రీనివాస్, పేర్ని నాని ఆ విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉత్సవాలు ముగిసిన వెంటనే ఆ భూములను తిరిగి దేవాదయ శాఖకు అప్పగిస్తామని చెప్పారు. కాబట్టి వైసీపీ నేతలు విష ప్రచారం మానుకోవాలని హితవు పలికారు. అంతేకాదు, భవిష్యత్తులో ఒక్కొక్కరి జాతకాలు తన రెడ్ బుక్ నుంచి బయటకు వస్తాయని వార్నింగ్ ఇచ్చారు. మచిలీపట్నంలోని దేవాదయ భూముల దోపిడీపై పేర్ని నాని సమాధానం చెప్పాలని బుద్ధా వెంకన్న డిమాండ్ చేశారు.