మోదీపై షర్మిల సంచలన ఆరోపణలు

admin
Published by Admin — September 15, 2025 in Andhra
News Image

దేశంలో ఓట్ల చోరీ జరుగుతోందని కాంగ్రెస్ ఎంపీ, ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్ర ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) పనితీరుపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సంచలన ఆరోపణలు చేశారు. ప్రధాని మోదీ చేతిలో ఎన్నికల సంఘం బందీగా మారిందని ఆమె షాకింగ్ ఆరోపణలు చేశారు. భారత రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును కాపాడాల్సిన ఈసీఐ....బీజేపీకి ఎన్నికల ఏజెంట్‌గా పనిచేస్తోందని విమర్శలు గుప్పించారు. ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడుకునేందుకు ప్రజలంతా కలిసికట్టుగా పార్టీలకతీతంగా పోరాడాల్సిన సమయం ఆసన్నమైందన్నారు.

ఎన్నికలను స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా నిర్వహించాల్సిన కేంద్ర ఎన్నికల సంఘం పూర్తిగా బీజేపీ ప్రయోజనాల కోసం పనిచేస్తోందని ఆమె దుయ్యబట్టారు. ఎన్నికల సంఘంతోపాటు సీబీఐ, ఈడీ, ఆదాయపు పన్ను శాఖ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలు, స్వయంప్రతిపత్తి కలిగిన సంస్థలు ప్రధాని మోదీ గుప్పిట్లో ఉన్నాయని ఆరోపించారు. మోదీ ఆదేశాల ప్రకారం ఆయా సంస్థలు పనిచేస్తున్నాయని విమర్శించారు. మోదీ గుట్టును రాహుల్ గాంధీ విప్పారని చెప్పారు.

కర్ణాటకలోని మహాదేవపుర నియోజకవర్గంలో  నకిలీ ఫోటోలు, పేర్లతో లక్ష దొంగ ఓట్లు నమోదు చేశారని ఆరోపించారు. మహారాష్ట్ర ఎన్నికల సమయంలో పోలింగ్ చివరి గంటలో అనూహ్యంగా 60 లక్షలకు పైగా ఓట్లు పోల్ అయ్యాయని, ఆ ఓట్లు ఎవరు వేశారో చెప్పడానికి ఈసీ వద్ద ఎలాంటి ఆధారాలు, సీసీటీవీ ఫుటేజ్ లేదని దుయ్యబట్టారు. ఎన్నికలకు 5 నెలల ముందు కోటికి పైగా కొత్త ఓట్లు నమోదు కావడం వెనుక పెద్ద కుట్ర ఉందని అనుమానం వ్యక్తం చేశారు. ఈ ఓట్ల చోరీపై పోరాటంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా సెప్టెంబర్ 15 నుంచి అక్టోబర్ 15 వరకు సంతకాల సేకరణ ఉద్యమాన్ని చేపడుతున్నామని, ప్రజలు ఇందులో పాల్గొనాలని పిలుపునిచ్చారు.

Tags
pm modi ys sharmila ECI
Recent Comments
Leave a Comment

Related News