నేపాల్ ప్రభుత్వాన్ని కుప్పకూల్చిన జెన్ జడ్ (Gen Z) గురించి ఈ తరం యువతకు పరిచయం అక్కర లేదు. సోషల్ మీడియాపై నిషేధం విధించిన ప్రధానిని గద్దె దించేదాకా ఊరుకోలేదు జెన్ జడ్ యువత. దీంతో, అసలేంటీ జెన్ జెడ్...ఎవరు జెన్ జెడ్ కేటగిరీలోకి వస్తారు అన్న చర్చ మొదలైంది.
1997 నుంచి 2012 మధ్య పుట్టిన తరం వారిని జెన్ జెడ్ కేటగిరీ అని చెప్పవచ్చు. వీరిని డిజిటల్ నేటివ్స్ అని కూడా పిలుస్తుంటారు. ఇంటర్నెట్, సోషల్ మీడియా, స్మార్ట్‌ఫోన్స్, టెక్నాలజీ జమానాలో పుట్టిపెరిగిన నేపథ్యంలో వారికి జెన్ జెడ్ అని పేరు వచ్చింది. అంటే, వీరు 90's కిడ్స్ లాగా బ్లాక్ అండ్ వైట్ టీవీ చూస్తూ...గ్రౌండ్ కు వెళ్లి క్రికెట్ ఆడిన బ్యాచ్ కాదన్నమాట. మూడేళ్లకే స్మార్ట్ ఫోన్ చేతబట్టి...అందులోనే ఆన్ లైన్ గేమ్స్ ఆడే రేంజ్ ఈ జెన్ జెడ్ ది. వారి లైఫ్ స్టైల్, ఎథిక్స్, థింకింగ్...ఇవన్నీ గత తరాల కంటే ఎంతో భిన్నంగా ఉంటాయి.
కొత్త టెక్నాలజీ, సోషల్ మీడియా ట్రెండ్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, స్టార్టప్‌లు…వీరి వ్యవహారాలు. కొత్త ఆవిష్కరణలు...ఎటువంటి పరిస్థితులకైనా అలవాటు పడిపోవడం వీరి ప్రత్యేకత. తమకంటూ ఓ వ్యక్తిత్వం ఉండాలి అని కోరుకుంటూ స్వతంత్రంగా జీవించేందుకు వీరు ఇష్టపడతారు. తమ తలరాత తామే రాసుకోవాలని అనే టైప్ వీరు. తమ అభిప్రాయాలు కుండబద్దలు కొట్టినట్లు చెప్పడం, తమకు నచ్చిన జీవనశైలిని అనుసరించడం వీరి లక్షణాలు. తమ ఉద్యోగం, వ్యాపారం..తామే ఎంచుకొని రాణించాలనుకోవడం, తల్లిదండ్రులపై పెద్దగా ఆధారపడకూడదు అన్న అభిప్రాయాలు వీరి సొంతం.
పర్యావరణ పరిరక్షణ, సమానత్వం, మానవ హక్కులు వంటి విషయాల్లో వీరి చాలా క్లారిటీతో ఉంటారు. సామాజిక న్యాయం కోసం పోరాడడం, అసమానత్వం అంతం కావాలని కోరుకోవడం వీరి స్వభావం.కలలు కనడమే కాదు...వాటిని సాకారం చేసుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తారు ఈ జెన్ జెడ్ బ్యాచ్.
వీరు లింగ, మత, జాతి, ప్రాంత, భాషా భేదాలు పట్టించుకోకుండా ప్రతిభకు ప్రాధాన్యతనిస్తారు.తక్షణ ఫలితాల కోసం ఎంత కష్టానికైనా సిద్ధపడతారు. పని రాక్షసుల్లా కాకుండా వ్యక్తిగత జీవితానికి, కుటుంబానికి కూడా సమయం కేటాయిస్తుంటారు. తమకు నచ్చిన రంగంలోనే రాణించేందుకు ప్రయత్నిస్తున్నారు.
మార్పు కోసం ఎదురు చూడకుండా మార్పు తమతోనే మొదలయ్యేందుకు మార్గాలు అన్వేషిస్తుంటారు.Gen Z అంటే ఒక తరం కాదని, భవిష్యత్తును మలిచే శక్తి అని నమ్ముతుంటారు. ప్రపంచాన్ని కొత్త దిశగా నడిపించి భవిష్యత్ తరాలకు మెరుగైన ప్రపంచాన్ని అందించాలన్నది వీరి ఆలోచన. నేపాల్ లో హింస విషయాన్ని పక్కనబెడితే...అక్కడి జెన్ జెడ్ తరం యువత ఆలోచన సరైనదే.