ఓటుకు రూ. 20 కోట్లు.. ఉప రాష్ట్రపతి ఎన్నికలపై టీఎంసీ బాంబు

admin
Published by Admin — September 11, 2025 in Politics, National
News Image

ఉప రాష్ట్రపతి ఎన్నికల ఫలితాలు ప్రకటించగానే, ఎన్డీఏ కూట‌మి అభ్యర్థి సి.పి.రాధాకృష్ణన్ గెలుపు ఖరారైంది. ఈ ఎన్నికల్లో ఇండియా కూటమి తరుఫున జస్టిస్ బి సుద‌ర్శ‌న్ రెడ్డి పోటీ చేయ‌గా.. ఎన్డీఏ కూట‌మి నుంచి రాధాకృష్ణన్ బ‌రిలోకి దిగారు. మొత్తం 781 మంది ఎంపీల‌కు గానూ.. 767 మంది త‌మ ఓటు హ‌క్కును వినియోగించుకున్నారు. సి.పి. రాధాకృష్ణన్‌కు 452 ఓట్లు రాగా, బి. సుదర్శన్ రెడ్డికి 300 ఓట్లు వచ్చాయి. దీంతో దేశ 17వ ఉపరాష్ట్రపతిగా రాధాకృష్ణన్ ఎన్నికయ్యారు.

అయితే ఈ విజయాన్ని మించి ఎక్కువ చర్చకు దారితీస్తున్నది క్రాస్ ఓటింగ్ ఆరోపణలు. ఉప రాష్ట్రపతి ఎన్నికలపై టీఎంసీ బాంబు పేల్చింది. ఈ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ జరిగిందని.. ఒక్కో ఓటుకు రూ.20 కోట్లు ఇచ్చి ఇండియా కూటమి ఎంపీలను అధికార‌ బీజేపీ కొనుగోలు చేసింద‌ని తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ బెనర్జీ తాజాగా సంచలన ఆరోప‌ణ‌లు చేశారు.
 
క‌నీసం ఐదు నుంచి ఏడుగురు ఎంపీలు ఇండియా కూటమి అభ్యర్థిని విడిచిపెట్టి ఎన్డీఏ అభ్యర్థికి మద్దతు తెలిపారని, చెల్లని ఓట్లు కలిపి చూసినా క్రాస్ ఓటింగ్ స్పష్టమవుతోందని ఆరోపించారు. కూటమి ఐక్యతను దెబ్బ తీస్తూ ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ఒక మహిళా ఎంపీ బహిరంగంగానే బీజేపీకి మద్దతు తెలిపార‌ని.. ఇండియా కూటమి కట్టుబాటును తుంగలో తొక్కారని అభిషేక్ బెనర్జీ ధ్వ‌జ‌మెత్తారు. క్రాస్ ఓటింగ్ కారణంగానే ఎన్డీయే కూటమి అభ్యర్థికి భారీ మెజారిటీ లభించిందని అభిషేక్ బెనర్జీ ఆరోపించారు.

కాగా, ఉప రాష్ట్రపతి ఎన్నికలు సాధారణంగా పెద్దగా హడావుడి చేయవు. కానీ ఈసారి క్రాస్ ఓటింగ్ కారణంగా, ఎన్నికల ఫలితాల కంటే ఎక్కువగా ప్రతిపక్ష ఏకత వైఫల్యం హాట్ టాపిక్ అయింది. బీజేపీకి ఇప్పటికే లోక్‌సభలో బలమైన ఆధారం ఉంది. ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో గెలుపు ఖాయమే అన్న భావన కూడా ఉండేది. అయితే రాధాకృష్ణన్‌కు లభించిన భారీ మెజారిటీ వెనుక ప్రతిపక్షం నుంచి వచ్చిన ఓట్లు కూడా ఉన్నాయ‌ని స్ప‌ష్ట‌మ‌వుతోంది. ఈ ప‌రిణామం ప్రతిపక్ష భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మార్చింది. పైగా అభిషేక్ బెనర్జీ బీజేపీపై నేరుగా రూ.20 కోట్లు ఆరోపణ చేయడం వల్ల కూటమిలో పగుళ్లు మరింత బహిర్గతం అయ్యాయి.

Tags
Abhishek Banerjee TMC BJP Vice-President poll India Latest News
Recent Comments
Leave a Comment

Related News