సింహాచలం అప్పన్న చందనోత్సవం సందర్భంగా గోడ కూలిన ప్రమాద ఘటనలో ఏడుగురు భక్తులు మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆ ప్రమాద ఘటనపై ప్రమాదంపై ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితుల కుటుంబాలకు మోదీ సానుభూతి వ్యక్తం చేశారు. పీఎం సహాయ నిధి నుంచి ఎక్స్ గ్రేషియాను ప్రకటించారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. ఈ ఘటనలో గాయపడిన వారికి రూ.50 వేలు చొప్పున పరిహారం ప్రకటించారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
ఈ ఘటనపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చందనోత్సవం వేళ అప్పన్న సన్నిధిలో భక్తులు మరణించిన ఘటన తీవ్ర ఆవేదనను కలిగించిందని రేవంత్ అన్నారు. గోడ కూలి ప్రమాదం జరిగిన ఈ ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. మృతి చెందిన వారి ఆత్మలకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని చెప్పారు.
మరోవైపు, ఈ ఘటనపై ఏపీ మాజీ సీఎం జగన్ కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గోడ కుప్పకూలి భక్తులు మృత్యువాత పడటంపై జగన్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. స్వామివారి నిజరూప దర్శనానికి వచ్చిన భక్తులు ఇటువంటి దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనలో గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని, మరణించిన భక్తుల కుటుంబాలను ఆదుకోవాలకి ప్రభుత్వాన్ని కోరారు.
ఈ ఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనలో మృతి చెందిన కుటుంబాలకు సానుభూతి తెలిపిన కేటీఆర్..గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
కాగా, ఈ దుర్ఘటనలో ఏడుగురు భక్తులు మృతి చెందగా...మరో 10 మందికి తీవ్రగాయాలయ్యాయి. శిథిలాల కింద మరికొందరు ఉన్న నేపథ్యంలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని భావిస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న రెస్క్యూ, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు చేపట్టాాయి.