కన్నడ అనువాద చిత్రాలు ఎ, రా, ఉపేంద్ర ఒకప్పుడు తెలుగులోనూ సంచలనం రేపాయి. ఆ చిత్రాలతో ఇక్కడా మాంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించాడు ఉప్పి. తన క్రేజ్ చూసి తెలుగులోనూ అవకాశాలు ఇచ్చారు దర్శకులు. కానీ ఉపేంద్ర తెలుగులో కొన్ని చిత్రాల్లో నటించాడు కానీ.. ఒక్కటీ అనుకున్నంతగా సక్సెస్ కాలేదు.
హీరోగా నటించిన కన్యాదానం, ఒకే మాట లాంటి చిత్రాల సంగతి పక్కన పెడితే.. చాలా ఏళ్ల గ్యాప్ తర్వాత తెలుగులో సన్నాఫ్ సత్యమూర్తి, గని చిత్రాల్లో నటిస్తే అవీ నిరాశపరిచాయి. ముఖ్యంగా ‘గని’ ఘోరమైన ఫలితాన్నందుకోవడంతో మళ్లీ తెలుగు చిత్రాల వైపు చూడలేదు ఉపేంద్ర. ఐతే ఇప్పుడు ఈ కన్నడ సూపర్ స్టార్‌ను మళ్లీ తెలుగులోకి తీసుకొస్తున్నట్లు సమాచారం. యువ కథానాయకుడు రామ్ హీరోగా నటిస్తున్న కొత్త చిత్రంలో ఉపేంద్ర ఓ కీలక పాత్ర చేస్తున్నాడట.
‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ ఫేమ్ మహేష్ బాబు.. రామ్ హీరోగా ఒక క్లాస్ లవ్ స్టోరీ తీస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో ‘మిస్టర్ బచ్చన్’ ఫేమ్ భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటిస్తోంది. ఇందులో ఓ సీనియర్ హీరో స్పెషల్ రోల్ చేస్తాడని ఇంతకుముందే వార్తలు వచ్చాయి. ఆ పాత్ర కోసమే ఇప్పుడు ఉపేంద్రను ఎంచుకున్నారట. ఆయన కూడా ఓకే చెప్పేశారని.. త్వరలోనే షూట్‌కు కూడా హాజరవుతారని అంటున్నారు. ఇంతకుముందు ఉపేంద్ర తెలుుగలో ఎక్కువగా మాస్ టచ్ ఉన్న పాత్రలే చేశాడు.
ఈసారి మాత్రం ఆయన పాత్ర క్లాస్‌గా ఉంటుందని సమాచారం. తన ఇమేజ్‌కు భిన్నమైన ఈ పాత్రతో అయినా తెలుగులో మంచి ఫలితాన్ని అందుకుంటాడేమో చూడాలి. ఉపేంద్ర తమిళంలో సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమా ‘కూలీ’లోనూ ఓ స్పెషల్ రోల్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక రామ్ సినిమాకు సంబంధించి త్వరలోనే టైటిల్ టీజర్ రాబోతోంది. ఉపేంద్ర ఈ చిత్రంలో ప్రత్యేక పాత్ర చేస్తున్న విషయాన్ని కూడా త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారట.