టాలీవుడ్ సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ ఇటు సినీ రంగంలో, అటు రాజకీయ రంగంలో విశేష సేవలందించిన సంగతి తెలిసిందే. దాంతోపాటు బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్ హోదాలో ఎంతోమందికి ప్రాణదానం చేశారు. ఇటీవలే 50 ఏళ్ల సినీ ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్నారు. ఈ క్రమంలోనే బాలయ్య బాబు సేవలకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం ఆయనను పద్మ భూషణ్ పురస్కారంతో సత్కరించింది.ఈ క్రమంలోనే నేడు రాష్ట్రపతి ముర్ము చేతుల మీదుగా పద్మ భూషణ్ అవార్డును బాలకృష్ణ అందుకున్నారు. అవార్డు అందుకున్న సందర్భంగా తన తండ్రి ఎన్టీఆర్ ను బాలయ్య గుర్తు చేసుకొని ఎమోషనల్ అయ్యారు. ‘‘ఈ శుభవార్తను వినేందుకు నా తండ్రి జీవించి ఉంటే బాగుండుదనిపిస్తోంది. ఆయన ఎంతో గర్వపడేవారు’’ అని బాలయ్య బాబు భావోద్వేగానికి గురయ్యారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి బాలయ్య కుటుంబ సమేతంగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో బాలకృష్ణ సతీమణి వసుంధర, మంత్రి నారా లోకేష్, ఆయన సతీమణి బ్రాహ్మణి, బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ, బాలకృష్ణ చిన్న కూతురు తేజస్విని, అల్లుడు భరత్ పాల్గొన్నారు. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు బాలకృష్ణకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలోనే కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కూడా రాష్ట్రపతి ముర్ము చేతుల మీదుగా పద్మ భూషణ్ అవార్డు అందుకున్నారు.