``వైసీపీ అధినేత జగన్ బయటకు వస్తే.. చాలు ఏదో ఒకటి జరుగుతోంది!`` అని టీడీపీ నాయకులు అన్నట్టుగానే తాజాగా కూడా మరో ఘటన చోటు చేసుకుంది. గతంలో తెనాలి, రెంటపాళ్ల, గుంటూరు పర్యటనల సమయంలోనూ ఉద్రిక్తతలు, మరణం చోటు చేసుకున్నాయి. తాజాగా జగన్.. కర్నూలు జిల్లా డోన్‌లో పర్యటించారు. వాస్తవానికి ఇది వ్యక్తిగత పర్యటనే. రాజకీయ పరమైన అంశాలతో ముడిపడిలేదు. పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కుమారుడు అర్జున్ వివాహ రిసెప్షన్‌కు జగన్ హాజరయ్యారు. అయితే.. ఈ పర్యటనలో ఏకంగా ఆరుగురు మృతి చెందారు.
ఏం జరిగింది?
జగన్.. తన వ్యక్తిగత పర్యటనకు కూడా రాజకీయ హంగులు అద్దారు. యధావిధిగా ఆయన కర్నూలులోకి ఎంట్రీ ఇవ్వగానే.. కారు ఫుట్ బోర్డుపై నిలబడి.. ప్రజలకు అభివాదం చేస్తూ.. డోన్ నియోజకవర్గంలోకి పర్యటించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఆయనను చూసేందుకు భారీ సంఖ్యలో ప్రజలు వచ్చారు. వాహనాలు.. లారీల్లోనూ ప్రజలు తరలివచ్చారు. ఇది రాజకీయ కార్యక్రమం కావడంతో పోలీసులు ఎలాంటి ఆంక్షలు పెట్టలేదు. ఎలాంటి చర్యలు కూడా తీసుకోలేదు. దీంతో వేలాది మంది జగన్‌ను అనుసరించారు. ఈ క్రమంలో ఓ ట్రాలీ ఆటోలో సుమారు పాతిక మందిపైగా.. జగన్‌ను చూసేందుకు తరలి వచ్చారు.
వెల్దుర్తి హైవేపై వారు వస్తుండగా.. ట్రాలీ ఆటో ముందు టైరు పేలిపోయింది. దీంతో వాహనం బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆరుగురి పరిస్థితి విషమంగా మారడంతో హుటాహుటిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం కర్నూలుకు తరలిస్తుండగా.. వారిలో ముగ్గురు మృతి చెందారు. ఆసుపత్రికి చేరుకున్న కొద్ది సేపటికి మరో ఇద్దరు.. ఓ గంట తర్వాత.. మరొకరు మొత్తంగా ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు.
ఈ ఘటనలో మరో 30 మంది వరకు తీవ్రంగా గాయపడ్డారు. బాధితులంతా బేతంచర్ల మండలం రుద్రవరం గ్రామానికి చెందిన వారుగా గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. తామంతా జగన్‌ను చూసేందుకు వెళ్తున్నట్టు బాధితులు తెలిపారు.