లులు మాల్స్ దూకుడు.. తెలుగు రాష్ట్రాల్లో మరో ‘3’

admin
Published by Admin — July 29, 2025 in Andhra, Telangana
News Image

సూపర్ మార్కెట్లు.. హైపర్ మార్కెట్లు కొత్తేం కావు. అయితే.. అందరికి తెలిసిన ఈ జోనర్ లో సరికొత్త షాపింగ్ అనుభూతిని ఇవ్వటం లులు మాల్స్ కే సాధ్యం. ఈ కారణంతోనే..తెలుగు రాష్ట్రాల్లో తొలిసారి హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన లులు మాల్ కు వచ్చిన బజ్ అంతా ఇంతా కాదు. ఈ మాల్ ప్రారంభంలో దాదాపు మూడు నెలల పాటు.. ఆ చుట్టుపక్కల ప్రాంతాలు ఎంతలా కిటకిటలాడాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికి వారాంతాల్లో లులు మాల్ జోరు ఒక రేంజ్ లో ఉంటుంది.

 

హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన మాల్ పని తీరు బాగానే ఉన్నా.. ఆర్థికంగా మాత్రం అంకెలు ఆకర్షణీయంగా లేవన్న మాట మార్కెట్ వర్గాల నుంచి వినిపిస్తోంది. అయితే.. దీర్ఘకాలిక వ్యూహంలో భాగంగా తెలుగు రాష్ట్రాల్లో తమ వ్యాపారాన్ని విస్తరించాలన్న ఆలోచనలో లులు గ్రూప్ ఉన్నట్లు చెబుతారు. దీనికి తగ్గట్లే.. పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. త్వరలో ఏపీలో రెండు ప్రధాన నగరాల్లో తమ సూపర్ మార్కెట్లను ఏర్పాటు చేసే దిశగా లులు అడుగులు వేస్తోంది.

 

ఏపీలోని విజయవాడలో అత్యంత రద్దీగా ఉండే ప్రాంతాల్లో ఒకటైన  ఆర్టీసీ బస్టాండ్ కు సమీపంలోని 4.15 ఎకరాల భూమిని లీజు పద్దతిలో ఇచ్చేందుకు ఏపీ ప్రభుత్వం ఓకే చెప్పటం తెలిసిందే. ఇక్కడ 2.23 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో షాపింగ్ మాల్ ఏర్పాటు చేసేందుకు లులు ఇంటర్నేషనల్ షాపింగ్ మాల్స్ ప్రైవేటు లిమిటెడ్ కు ఏపీ ప్రభుత్వం స్థలాన్ని లీజుకు ఇవ్వటం తెలిసిందే. ఇక్కడున్న ఆర్టీసీ డిపోను.. వేరే ప్రాంతంలోకి తరలిస్తున్న సంగతి తెలిసిందే.

 

ఇదిలా ఉండగా తాజాగా ఉక్కు నగరంగా పేరున్న విశాఖపట్నంలోనూ లులు మాల్ మరో భారీ షాపింగ్ మాల్ ను సిద్ధం చేసేందుకు వీలుగా ఏపీ ప్రభుత్వం భూమిని కేటాయించింది. దీనికి సంబంధించిన అధికారిక ఉత్తర్వుల్ని జారీ చేసింది. విశాఖలో ఏర్పాటు చేసే మాల్ కోసం తొంభై తొమ్మిదేళ్ల కాలానికి లీజు ప్రాతిపదికన 13.74 ఎకరాల భూమిని కేటాయించారు. ఇందులో లులు సూపర్ మార్కెట్.. లులు ఫ్యాషన్.. లులు కనెక్టు.. ఫ్యామిలీ ఎంటర్ టైన్ మెంట్ సెంటర్ తో పాటు మరిన్ని ఏర్పాటు చేయనున్నారు.

 

ఈ ప్రాజెక్టును ప్రత్యేకమైన కేటగిరీగా పరిగణిస్తూ మూడేళ్ల లీజు మాఫీని వర్తింపజేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. లీజు ధరను 2024 ఏపీ రాష్ట్ర పర్యాటక భూముల కేటాయింపు విధానంలో పేర్కొన్న ప్రకారం ఇవ్వనున్నారు. దీనిపై ఏమైనా కోర్టు కేసులు ఉంటే.. వాటి పరిష్కార బాధ్యతను ఏపీఐఐసీ.. రెవెన్యూ శాఖ చర్యలు తీసుకోవాలన్న ఆదేశాలు జారీ చేసింది. ఏపీలో రెండు మెగా సూపర్ మార్కెట్లను ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతున్న లులు.. తెలంగాణలో హైదరాబాద్ లోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్టులో మరో భారీ సూపర్ మార్కెట్ ఏర్పాటు దిశగా అడుగులు వేస్తున్నట్లు చెబుతున్నారు. మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో లులు విస్తరణ మాంచి జోరు మీద సాగుతుందని చెప్పక తప్పదు.

 

మరోవైపు ఈ భూముల కేటాయింపుపై వైసీపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. అత్యంత ఖరీదైన భూమిని అత్యంత తక్కువ ధరకు అప్పజెబుతున్నారని ఆరోపిస్తోంది. విజయవాడలో లులు పెట్టే పెట్టుబడి రూ.156 కోట్లు అయితే.. అందుకు రూ.600 కోట్ల భూమిని అప్పజెప్పాల్సిన అవసరం ఏమిటి?అని ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు.. మొదటి మూడేళ్లకు ఎలాంటి లీజు లేకుండా.. నిర్మాణం పూర్తి అయిన తర్వాత నుంచి లీజు వసూలు చేయనున్నట్లుగా తాజాగా జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్న వైనాన్ని ప్రశ్నిస్తున్నారు. చదరపు అడుగుకు నెలకు రూ.1.5 చొప్పున ఏడాదికి రూ.4.51 కోట్లు ప్రభుత్వానికి లులు చెల్లిస్తుంది. హైదరాబాద్ లో చదరపు అడుగు రూ.80కు పైనే పలుకుతున్న వైనాన్ని ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు.. లీజు మొత్తాన్ని ప్రతి పదేళ్లకు కేవలం పది శాతాన్ని పెంచుతున్న వైనంపై అభ్యంతరాల్నివ్యక్తం చేస్తోంది.

Tags
Lulu Malls Telugu states Andhra Pradesh Telangana Ap News
Recent Comments
Leave a Comment

Related News