తెలుగు రాష్ట్రాల్లో నోరు పారేసుకునే నేతలకు కొదవ లేదు. అలాంటి నేతల జాబితాలో బీజేపీ నేత.. కేంద్ర మంత్రి బండి సంజయ్ పేరు టాప్ ఫైవ్ లో ఉంటుంది. ఆయన నోటికి భయపడే నేతలు చాలామందే ఉంటారు. అలాంటి బండి సంజయ్ ను ఉద్దేశించి బీజేపీకి చెందిన మరో సీనియర్ నేత.. నోరు పారేసుకోవటం అన్నది కనిపించని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ నోటి నుంచి వచ్చిన మాటల్ని వింటే అవాక్కు అవ్వాల్సిందే. సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఇంత దారుణంగా ఈటల రియాక్టు అయ్యింది లేదు. అందునా.. సొంత పార్టీకి చెందిన కేంద్ర మంత్రిని ఉద్దేశించి నేరుగా.. ‘‘బీకేర్ ఫుల్ కొడకా.. బీకేర్ ఫుల్’ అనే వరకు విషయం వెళ్లటం ఇప్పుడు పెను సంచలనంగా మారింది.
ఎంత ఫస్ట్రేషన్ లోనూ నోరు పారేసుకోకుండా మాట్లాడే నేతగా ఈటలకు పేరుంది. నిర్మాణాత్మకంగా మాట్లాడటం.. తప్పులు ఎత్తి చూపుతూ వ్యాఖ్యలు చేయటమే చూశాం తప్పించి.. ఇంత సీరియస్ వ్యాఖ్యలు.. అందునా సొంత పార్టీకి చెందిన ముఖ్యనేత మీద చేసింది లేదు. అక్కడితో ఆగని ఈటల రాజేందర్.. ‘‘‘వాడు సైకోనా.. శాడిస్టా? మనిషా.. పశువా? ఏ పార్టీలో ఉన్నడు? ఎవని అండతో ధైర్యం చేస్తున్నడు? మేం శత్రువుతో కొట్లాడుతం. కానీ, కడుపులో కత్తులు పెట్టుకుని కౌగిలించుకునే సంస్కృతి మా రక్తంలో లేదు. నీ శక్తి ఏంది? యుక్తి ఏంది? నీ చరిత్ర ఏంది? మా చరిత్ర ఏందిరా?’’ అంటూ షాకింగ్ వ్యాఖ్యలు చేశారు.
సోషల్ మీడియాలో పెడుతున్న పోస్టులన్నీ అధిష్ఠానానికి పంపుతామని చెప్పిన ఈటల.. ఇలాంటి వారిని అరికట్టకపోతే తనకేమీ నష్టం లేదంటూనే.. ‘‘మౌనంగా ఉండేవాణ్ని బలహీనుడిగా చూడవద్దు. పిచ్చి వేషాలు వేస్తే నష్టం ఎవరికో మీకు తెలుస్తుంది. నా జోలికి రావద్దు.. అడ్డు రావద్దు. శామీర్‌పేట బీజేపీ అడ్డా. ఇక్కడ ఎంపీని నేను. ప్రధాని మోదీ మొదట ప్రచారం చేసిన గడ్డ ఇది. గ్రామంలో క్రెడిబులిటీ ఉన్న లీడర్ లేకపోతే పార్టీ బతకదని నమ్మినవాణ్ని. వ్యక్తులు ఎదగకుండా పార్టీలు ఎదగవు. మానవ సంబంధాలు మీకేం తెలుసు? సోషల్ మీడియాను నమ్ముకొని, అబద్ధాల పునాదుల మీద, కుట్రలు కుతంత్రాల మీద కొంతమంది బతుకుతున్నారు. నాది స్ర్టెయిట్ ఫైట్. స్ర్టీట్ ఫైట్ ఉండదు. రాజశేఖర్‌రెడ్డి, రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి, కేసీఆర్ లాంటి వాళ్లతోనే కొట్లాడాం. ధీరుడు ఎక్కడా భయపడడు. కొంతమంది వెకిలిగాళ్లు ఇంకెక్కడి తెలంగాణ ఉద్యమం అంటున్నారు. కానీ, హుజూరాబాద్‌లో మేము చేసిన ఉద్యమం ఇంకా మా గుండెల్లో ఉంది. చైతన్యం, ముక్కుసూటితనంతో బరిగీసి కొట్లాడిన గడ్డ హుజూరాబాద్ గడ్డ. మేము అక్కడి నుంచి వచ్చిన వాళ్లం’’ అంటూ ఉతికి ఆరేసే వ్యాఖ్యలు చేశారు.
ఇంతకూ ఈటల ఇంతటి ఆగ్రహానికి గురి కావటానికి కారణం.. బండికి ఆయనకు మధ్య కొంతకాలంగా పొసగని పరిస్థితి. అయినప్పటికీ.. మనసులో ఆ ఆగ్రహాన్ని పెట్టుకున్నా.. ఎక్కడా నోరు జారింది లేదు. తాజాగా పలువురు హుజూరాబాద్ నాయకులు కార్యకర్తలు శామీర్ పేటలోని ఈటల ఇంటికి వచ్చారు. ఈటలతో పాటు బీజేపీలోకి చేరిన తమకు (గతంలో వీరంతా బీఆర్ఎస్ కు చెందిన వారు) స్థానికంగా ప్రాధాన్యం ఇవ్వటం లేదన్నారు. జిల్లాలోని ఇతర బీజేపీ నేతలు ఈటల వర్గాన్ని పార్టీకి దూరం చేయాలని చూస్తున్నట్లుగా మొర పెట్టకున్నారు. దీంతో.. అప్పటివరకు వారి మాటల్ని విన్న ఆయన.. తీవ్ర పదజాలంతో మీడియాముందు బరస్ట్ అయ్యారు. తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఇంత తీవ్రమైన వ్యాఖ్యలు చేసిన మొదటి సందర్భంగా పలువురు చెబుతున్నారు. మరి.. ఇంతలా విరుచుకుపడిన ఈటల రాజేందర్ విషయాన్ని బీజేపీ అధినాయకత్వం ఎలా చూస్తుంది? బండితో ఆయనకున్న పంచాయితీని ఏం చేస్తారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.