హిందీ భాషను వ్యతిరేకిస్తూ తమిళనాడు అధికార పార్టీ డీఎంకే చాలా కాలంగా గళం వినిపిస్తున్న సంగతి తెలిసిందే. తమిళనాడుతో పాటు మరికొన్ని రాష్ట్రాలు కూడా తమ ప్రాంతీయ భాషలకు ప్రాధాన్యతనిస్తామని హిందీని వ్యతిరేకిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆ వ్యవహారంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరోసారి స్పందించారు. భాషతో సంబంధం లేకుండా విద్య, ఉపాధి, వ్యాపార అవకాశాల కోసం ప్రజలు ముందుకు వెళుతున్నారని పవన్ అన్నారు.
ఈ రోజుల్లో హిందీని గుడ్డిగా వ్యతిరేకించడం సరికాదని, అలా చేస్తే రాబోయే తరాల అభివృద్ధిని అడ్డుకున్న వారమవుతామని అన్నారు. హైదరాబాద్ లో రాజభాష విభాగం గోల్డెన్ జూబ్లీ వేడుకలకు హాజరైన పవన్ ఈ వ్యాఖ్యలు చేశారు. హిందీలో డబ్ అయిన 31% ఇండియన్ సినిమాలు లాభాలు తెచ్చిపెడుతున్నాయని పవన్ చెప్పారు. వ్యాపారానికి హిందీ కావాలని, కానీ నేర్చుకోవడానికి ఇబ్బంది ఏంటని ప్రశ్నించారు.
హిందీని నేర్చుకోవడం అంటే మన ఉనికిని కోల్పోవడం కాదని అన్నారు. ఇంకో భాషను అంగీకరిస్తే ఓడిపోయినట్లు కాదని, కలిసి ప్రయాణించడం అని చెప్పారు. దక్షిణ సమాజం పేరిట నిర్వహించిన కార్యక్రమంలో రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ రాయ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మరికొందరు బీజేపీ నేతలు పాల్గొన్నారు.