భారతీయ జనతా పార్టీ(బీజేపీ) జాతీయ నూతన అధ్యక్షుడు ఎవరు అన్న సస్పెన్స్ ఇంకా కొనసాగుతూనే ఉంది. అధ్యక్షుడు జేపీ నడ్డా పదవీకాలం 2023 జూన్ తోనే ముగిసింది. గత ఏడాది లోక్‌సభ ఎన్నికలు ఉండటంతో ఆయన పదవీ కాలం 2024 జూన్ వరకు పొడిగించారు. పొడిగించిన కాలం కూడా పూర్తి కావడంతో కొత్త అధ్యక్షుడి ఎంపిపై పార్టీలో విస్తృత స్థాయి చర్చలు జరుగుతున్నాయి. అయితే ఇలాంటి సమయంలో బీజేపీ అధిష్టానం చారిత్రాత్మక నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది. ఈసారి పార్టీ జాతీయ అధ్యక్ష పదవిని మహిళలకు కేటాయించాలని కమలం పెద్దలు భావిస్తున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది.
గత ఎన్నికల విజయాల్లో మహిళల పాత్ర ఎంతో కీలకంగా మారింది. వారి మద్దతును మరింత బలంగా నిలుపుకోవాలని చూస్తున్న బీజేపీ.. వ్యూహాత్మకంగా పార్టీ అత్యున్నత పదవిని మహిళకు కట్టబెట్టాలని ఆలోచన చేస్తోంది. ఈ క్రమంలోనే బీజేపీ జాతీయ అధ్యక్ష పదవి కోసం ప్రధానంగా ముగ్గురు మహిళా నేతులు రేసులో నిలిచారు. ఈ జాబితాలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఆంధ్రప్రదేశ్ బీజేపీ మాజీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి, తమిళనాడుకు చెందిన బీజేపీ మహిళా మోర్చా జాతీయ అధ్యక్షురాలు వానతి శ్రీనివాసన్ ఉన్నారు. ఈ ముగ్గురి పేర్లను పార్టీ అగ్రనాయకత్వం పరిశీలిస్తుందట.
కేంద్ర మంత్రిగా, పార్టీలో సీనియర్ మహిళా నేతగా ఉన్న నిర్మలా సీతారామన్ రేసులో ముందున్నట్లు టాక్ నడుస్తోంది. పార్టీ కార్యకలాపాల్లో, పాలనా అనుభవంలో విస్తృత పరిజ్ఞానం, నాయకత్వ సామర్థ్యం కలిగి ఉన్న నిర్మలమ్మ జాతీయ అధ్యక్ష పదవికి సరైనవారని భావిస్తున్నారు. ఆమె నియామకం ద్వారా దక్షిణాదిలో పాగా వేయాలన్న లక్ష్యం కూడా నెరవేరే అవకాశం ఉంది. ఇక పురందేశ్వరి నియామకం ద్వారా దక్షిణాదిలో మరీ ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో పార్టీని బలోపేతం చేయవచ్చని అధిష్టానం భావిస్తుందట. తమిళనాడులో క్షేత్రస్థాయి నుంచి ఎదిగిన వానతి శ్రీనివాసన్ పేరును కూడా పరిశీలిస్తున్నట్లు సమచారం అందుతోంది. ఈ ముగ్గురు మహిళా నేతల్లో కచ్చితంగా ఒకరికి పదవి కట్టబెట్టడం ఖాయం. అదే జరిగితే బీజేపీ చరిత్రలో ఒక మహిళ జాతీయ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టడం ఇదే తొలిసారి అవుతుంది.