అచ్చం భూమిలాంటి గ్రహం.. ఎంత దూరంలో అంటే?

News Image

అనంత విశ్వంలో మనం ఒంటరి వాళ్లమా? అన్న ప్రశ్నకు సమాధానం వెతికేందుకు మనిషి చేయని ప్రయత్నాలు లేవు.అయితే.. సాంకేతికంగా ఎంత ముందుకు వెళుతున్నప్పటికి.. ఈ అనంత విశ్వంలో జీవులు మనుగడ సాగించేందుకు అనుకూల వాతావరణ పరిస్థితులు ఎక్కడైనా ఉన్నాయా? అన్న దాని కోసం మనిషి పెద్ద ఎత్తున పరిశోధనలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు అందుకు తగ్గ కచ్ఛితమైన ఆధారాలు లభించలేదు. తాజాగా భారత సంతతికి చెందిన శాస్త్రవేత్త ఒకరు సౌర వ్యవస్థ వెలుపల ఉన్న ఒక గ్రహం మీద జీవం ఉందన్న విషయాన్ని గుర్తించటమే కాదు.. తన వాదనకు బలమైన ఆధారాల్ని చూపిస్తున్నారు.
 ప్రఖ్యాత యూనివర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జ్ పరిశోధకుల టీం.. మన భూమి నుంచి 124 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న ఒక గ్రహాన్ని గుర్తించారు.దీని పేరు కే2-18బీ. మన భూమితో పోలిస్తే దాదాపు 8.5 రెట్లు పెద్దదిగా ఉండే ఈ గ్రహంలో కచ్ఛితంగా జీవం ఉందని చెబుతున్నారు. నాసాకు చెందిన జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ ద్వారా ఈ గ్రహం మీద అనేక రకాల వాయువులు ఉన్నాయని కెమికల్ ఫింగర్ ప్రింట్స్ ద్వారా గుర్తించారు.  ఈ వాయువులు భూమిపైనా ఉండటమే తాజా పరిశోధనలో గుర్తించిన కొత్త అంశంగా చెప్పాలి.
ఈ వాయువులు జీవ సంబంధమైన ప్రక్రియ ద్వారానే ఉత్పత్తి అవుతాయని.. సముద్రంలోని ఆల్గేతో పాటు ఇతర జీవుల నుంచి ఈ వాయువుల ఉత్పత్తి అధికంగా ఉంటుందని చెబుతున్నారు. అయితే.. భూమిపై ఉన్నట్లు అక్కడ జీవించి ఉన్న ప్రాణాలు లేనప్పటికి జీవసంబంధిత ప్రక్రియలుజరుగుతున్నట్లుగా నిర్దారణకు వచ్చారు.అయితే..దీనిపై మరింత పరిశోధన జరగాల్సి ఉంటుందని చెబుతున్నారు.
జీవుల మనుగడ సాధ్యమయ్యే మరో గ్రహం దొరికిందని చెప్పటానికి ఇది తొలి సంకేతంగా చెబుతున్నారు. కేంబ్రిడ్జ్ లో అస్ట్రోఫిజిక్స్.. ఎక్సోప్లానెటరీ సైన్స్ ప్రొఫెసర్ గా పని చేస్తున్నారు భారత సంతతికి చెందిన నిక్కు మధుసూదన్. ‘సౌర వ్యవస్థకు బయట జీవం ఉనికి పరిశోధించే విషయంలో ఇదో కీలక మలుపు. ఇతర గ్రహాలపై మన సహచర జీవులు ఉన్నాయని కచ్ఛితంగా చెప్పే రోజు కొన్ని సంవత్సరాల్లో వస్తుంది. మనం ఒంటరివాళ్లం కాదు’ అని ఆయన స్పష్టం చేస్తున్నారు.
కే2-18బీ గ్రహం సబ్ నెఫ్టూన్ తరగతికి చెందినదిగా చెబుతున్నారు. ఇలాంటి గ్రహాల వ్యాసం భూమి వ్యాసం కంటే ఎక్కువగా.. నెఫ్ట్యూన్ వ్యాసం కంటే తక్కువగా ఉంటుంది. అయితే.. ఈ గ్రహం ఎలా ఏర్పడిందన్నది ప్రస్తుతానికి మిస్టరీగానే ఉంది. నిజానికి దీనిపై మిథేన్.. కార్బన్ డయాక్సైడ్.. డైమైథైల్ సల్ఫైడ్.. డైమైథెల్ డైసల్ఫెడ్ వాయువులు భారీగా ఉన్న విషయానని 2023లోనే గుర్తించారు. 1990 నుంచి ఇప్పటివరకు సౌర వ్యవస్థ బయట 5800 గ్రహాల్ని గుర్తించారు. వీటిని ఎక్సో ప్లానెట్స్ గా పిలుస్తుంటారు. వీటిలోచాలా వరకు ద్రవరూపంలోని నీటి సముద్రాలతో కప్పి ఉన్నట్లుగా చెబుతారు. ఆయా గ్రహాలపై జీవులు ఉండేందుకు వందశాతం అస్కారం ఉందంటున్నారు. అయితే.. వాటిని గుర్తించటమే మిగిలి ఉందని చెబుతున్నారు. రానున్న రోజుల్లో ఈ పరిశోధనలు మరో స్థాయికి వెళ్లే అంశాల్ని గుర్తించటం ఖాయమంటున్నారు.

Recent Comments
Leave a Comment

Related News