ఏపీ రాజకీయ వర్గాలకు షాకింగ్ లాంటి పరిణామం. ఎవరూ ఊహించని పరిణామం కూడా. తాను రాజకీయాల నుంచి తప్పుకొం టున్నానని చెప్పిన వైసీపీ మాజీ నాయకుడు, మాజీ రాజ్యసభ సభ్యుడు వేణుంబాకం విజయసాయిరెడ్డి.. కమలం గూటికి చేరుతున్నారని అత్యంత విశ్వసనీయ రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ఈ వ్యవహారంపై ప్రస్తుతం ఢిల్లీ స్థాయిలో మంతనాలు జరుగుతున్నట్టు కూడా తెలిసింది. ప్రస్తుతం ఏపీలో రాజ్యసభ సీటు ఎన్నికకు షెడ్యూల్ విడుదలైంది. ఇది ఒకప్పుడు విజయసాయిరెడ్డి సీటే కావడం గమనార్హం.వైసీపీలో ఉండగా.. ఆయన రెండు సార్లు రాజ్యసభకు ఎంపికయ్యారు. ఈ క్రమంలో 2022లో రెండో సారి పెద్దల సభలోకి అడుగు పెట్టారు. 2024లో జరిగిన ఎన్నికల్లో నెల్లూరు ఎంపీ స్థానం నుంచి కూడా పోటీ చేశారు. అయితే.. పార్టీ ఓటమి.. తనకు ప్రాధాన్యం తగ్గిందని భావించిన సాయిరెడ్డిఇటీవల పార్టీకి రాజీనామా చేశారు. అదేసమయంలో తన రాజ్యసభ సీటును కూడా వదులుకు న్నారు. అనంతరం.. ఆయన బీజేపీలోకి వస్తారని ప్రచారం జరిగింది. అదేసమయంలో సొంతగా పార్టీ పెడతారని.. రెడ్డి సామాజిక వర్గాన్ని దరి చేర్చుకుంటారని కూడా ఓ చర్చ తెరమీదికి వచ్చింది.కానీ, ఆ చర్చలకు ఫుల్ స్టాప్ పెడుతూ.. సాయిరెడ్డి.. ఇకపై తాను రాజకీయాల్లోకి వచ్చేది లేదని.. తాను తటస్థంగానే ఉండిపోతా నని చెప్పారు. అంతేకాదు.. తనపై రాసుకునే వారు ఏదైనా రాసుకోవచ్చని.. కానీ, నా నిర్ణయం మాత్రం మారబోదని చెప్పారు. అయితే.. తాజాగా ఆయన రాజీనామా చేసిన సీటు వ్యవహారం తెరమీదికి రావడం.. కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించ డం.. ఆ వెంటనే ఢిల్లీలో కీలక పరిణామాలు చోటు చేసుకోవడం.. సాయిరెడ్డి కేంద్ర మంత్రి అమిత్ షాతో భేటీ అవుతున్నారన్న ప్రచారం.. వంటివి ఆయన తిరిగి రాజకీయాల్లోకి వస్తున్నారన్న సంకేతాలు వచ్చాయి.ఇక, రాజకీయాల్లో ఒట్టు-గట్టు గురించి అందరికీ తెలిసిందే. అనేక మంది నాయకులు రాజకీయ సన్యాసం తీసుకుంటామని ప్రకటించి కూడా.. పదవులు పొందిన వారు ఉన్నారు. కాబట్టి.. రాజకీయ శపథాలు.. నేతిబీర చందమే. ఈ పరంపరలో సాయిరెడ్డి మాత్రం ఎందుకు ప్రత్యేకంగా ఉంటారు. ఏ ఎండకు ఆ గొడుగు తప్పదు. సో.. ఇప్పుడు సాయిరెడ్డి తీసుకున్న నిర్ణయం బీజేపీ అయితే.. తప్పుపట్టాల్సిన అవసరం లేదు. పైగా సాయిరెడ్డి వంటి బలమైన వ్యక్తి బీజేపీకి కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది. ఇదిలావుంటే.. తాజాగా ఎన్నిక ప్రకటించిన రాజ్యసభ సీటును బీజేపీకి కేటాయిస్తూ.. సీఎం చంద్రబాబు నిర్ణయించారని టీడీపీ వర్గాలు తెలిపాయి. ఇది కూడా.. సాయిరెడ్డి ఎంట్రీని బలపరుస్తోంది.