కాంగ్రెస్ అగ్రనాయకులు, తల్లీ కుమారుడు సోనియాగాంధీ, రాహుల్ గాంధీలు ఉక్కిరిబిక్కిరికి గురయ్యే ఘటన చోటు చేసుకుం ది. వారిపై తొలిసారి ఎన్‌ఫోర్స్‌మెంటు డైరెక్టరేట్(ఈడీ) కీలక నిర్ణయం తీసుకుంది. మనీలాండరింగ్ కేసులో రూపొందించిన చార్జి షీట్‌లో ఇద్దరి పేర్లను పేర్కొంది. ఇది కాంగ్రెస్ పార్టీని ఒకరకంగా కుదిపేసే ఘటన కావడం గమనార్హం. పైగా.. సోనియా అల్లుడు.. రాబర్ట్ వాద్రాను భూముల కుంభకోణం కేసులో విచారించిన తదుపతి నమోదు చేసిన చార్జిషీట్‌లో సోనియాగాంధీ, రాహుల్ గాంధీల పేర్లను పేర్కొనడం మరింత ఆశ్చర్యంగా మారింది.
ఏం జరిగింది?
నేషనల్ హెరాల్డ్ పత్రికను నడిపించేందుకు కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని యంగ్ ఇండియా గతంలో సొమ్ములు ఇచ్చింది. హెరాల్డ్ పత్రిక.. కష్టాల్లో ఉన్నప్పుడు.. యంగ్ ఇండియా ద్వారా ఇచ్చిన సొమ్ముతో ఆ సంస్థ నిలదొక్కుకుంది. అయితే.. ఆ తర్వాత.. హెరాల్డ్‌కు ఇచ్చిన సొమ్మును రాబట్టుకునే క్రమంలో(90 కోట్లు) భారీ ఎత్తున మనీలాండరింగ్ జరిగిందన్నది ప్రధాన ఆరోపణ. దీనిపై అప్పట్లో.. బీజేపీ నాయకుడు, అప్పటి రాజ్యసభ సభ్యుడు తమిళనాడుకు చెందిన సబ్రహ్మణ్య స్వామి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా.. కేసు నమోదైంది. దీనిని కేంద్రంలోని మోడీ సర్కారు తొలినాళ్లలోనే ఈడీ, సీబీఐలకు అప్పగించారు.
గతంలో విచారణ కూడా జరిగింది. మనీలాండరింగ్ జరిగిందని.. ఈడీ నిర్ధారించి.. కేసు నమోదు చేసింది. తాజాగా దీనిపై చార్జిషీట్ కూడా నమోదు చేసింది. ఇప్పుడు ఈ చార్జిసీట్‌లో సోనియాగాంధీ, రాహుల్ గాంధీలను పేర్కొనడంతో వారిని అరెస్టు చేసే అవకాశం ఈడీకి దక్కింది. లేదా .. కోర్టు అనుమతితో అయినా.. ఈ కేసును మరింత లోతుగా విచారణ చేసి.. వారిని కోర్టుకు తీసుకువచ్చే అవకాశం రెండూ ఏర్పడ్డాయి. ఇక, వీరితోపాటు.. కాంగ్రెస్ పార్టీ కి చెందిన ప్రస్తుతం విదేశాల్లో ఉన్న శామ్ పిట్రోడా, సుమన్ దుబే పేర్లను కూడా చార్జిషీట్‌లో చేర్చారు.
అయితే.. వీరికి గతంలోనే విచారణకు రావాలని నోటీసులు ఇచ్చినా రాలేదు. ఈ విషయాన్ని కూడా చార్జిషీట్‌లో పేర్కొన్నారు. ఇక, ఈ వ్యవహారంపై ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు ఈ నెల 25న విచారణ జరపనుంది. కాగా.. కాంగ్రెస్ అగ్రనాయకులు.. పైగా గాంధీ కుటుంబంలోకి కీలక సభ్యులపై మనీ లాండరింగ్ కేసులో కేసులు నమోదు కావడంతోపాటు.. చార్జిషీటులోనూ వారి పేర్లు నమోదు కావడం దేశ చరిత్రలో తొలిసారి. దీనిపై దేశవ్యాప్తంగా నిరసనలకు పిలుపునిస్తామని.. మోడీ ఆడిస్తున్న ఈడీ నాటకాన్ని ప్రజలకు వివరిస్తామని.. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వ్యాఖ్యానించారు.