ఐటిడిపి నేత చేబ్రోలు కిరణ్ పై దాడి చేసేందుకు వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ ప్రయత్నించడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే పోలీసుల విధులకు ఆటంకం కలిగించిన గోరంట్ల మాధవ్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే, గోరంట్ల మాధవ్ ను గుంటూరు కోర్టుకు హాజరు పరిచే సమయంలో కొందరు పోలీసులు వ్యవహరించిన తీరుపై ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
మీడియా ముందుకు వెళ్లే సమయంలో ముసుగు వేసుకోవడానికి మాధవ్ నిరాకరించారు. నాకు ముసుగు వేస్తారా అని పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా, పోలీసు వాహనం దిగిన వెంటనే మాధవ్ తనకు తానే కోర్టులోకి వెళ్లారు. వాస్తవానికి పోలీసుల ఎస్కార్ట్ తో ఆయన కోర్టులో హాజరు కావాలి. కానీ, అలా జరగలేదు. ఈ క్రమంలోనే విధులలో నిర్లక్ష్యం వహించిన 11 మంది ఎస్కార్ట్ పోలీసులపై పోలీస్ ఉన్నతాధికారులు సస్పెన్షన్ వేటు వేశారు.
అరండల్ పేట సిఐ వీరస్వామి, పట్టాభిపురం, నగరం పాలెం ఎస్సైలు రాంబాబు, రామాంజనేయులు... ఏఎస్ఐలు ఆంథోనీ, ఏడుకొండలు...నగరంపాలెం పోలీస్ స్టేషన్ కు చెందిన ఐదుగురు కానిస్టేబుళ్లు, అరండల్ పేటకు చెందిన కానిస్టేబుల్ పై సస్పెన్షన్ వేటు పడింది.