సుప్రీం సంచలనం.. రాష్ట్రపతికి టైం లైన్

News Image

గతంలో ఎప్పుడూ లేని విధంగా.. దేశ చరిత్రలో తొలిసారి అన్నట్లుగా సంచలన తీర్పును ఇచ్చింది దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు. రాష్ట్ర గవర్నర్లు పంపే బిల్లులపై రాష్ట్రపతికి నిర్దిష్ట టైమ్ లైన్ విధిస్తూ సుప్రీంకోర్టు సంచలన తీర్పును ఇచ్చింది. గవర్నర్లు పంపే బిల్లులపై రాష్ట్రపతి మూడు నెలల వ్యవధిలో నిర్ణయం తీసుకోవాల్సిందేనని స్పష్టం చేసింది.
తమిళనాడు అసెంబ్లీ ఆమోదించిన పది బిల్లులను రాష్ట్ర గవర్నర్ ఆర్ ఎన్ రవి నిలిపి ఉంచిన నేపథ్యంలో ఈ అంశం సుప్రీంకు చేరింది. నాలుగు రోజుల క్రితం గవర్నర్ తీరుపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారశైలి రాజ్యాంగ విరుద్ధమన్న సుప్రీంకోర్టు.. ఆ బిల్లులకు క్లియరెన్సు ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది.అదే సమయంలో ఏదైనా బిల్లును రాష్ట్రపతి ఆమోదం కోసం నిలిపి ఉంచాల్సి వస్తే.. గవర్నర్ తీసుకోవాల్సిన గరిష్ఠ గడువు నెల రోజులేనని తీర్పును ఇచ్చింది.
ఇదిలా ఉండగా.. దీనికి సంబంధించిన పూర్తి తీర్పును శుక్రవారం రాత్రి 10.54 గంటలకు సుప్రీంకోర్టు వెబ్ సైట్ లో ఉంచారు. మొత్తం 415 పేజీల్లో ఉన్న పూర్తి తీర్పును వెలువరించింది. గవర్నర్లు పంపే బిల్లుపై రాష్ట్రపతి మూడు నెలల్లో నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని జస్టిస్ జేబీ పార్దీవాలా.. జస్టిస్ ఆర్ మహదేవన్ లతో కూడిన ధర్మాసనం తీర్పును ఇచ్చింది. ఏదైనా జాప్యం జరిగితే రాష్ట్రపతి భవన్ అందుకు తగిన కారణాల్ని రాష్ట్రాలకు వివరించాలని పేర్కొంది.
ఒకవేళ నిర్దేశిత గడువు లోపు రాష్ట్రపతి నుంచి ఎలాంటి స్పందన లేకుంటే రాష్ట్ర ప్రభుత్వాలు మాండమస్ రిట్ పిటిషన్ దాఖలు చేయొచ్చని సుప్రీం పేర్కొంది. రాజ్యాంగంలోని 200వ అధికరణ ప్రకారం మంత్రిమండలి సలహా సూచనల మేరకు గవర్నర్లు తప్పనిసరిగా వ్యవహరించాల్సి ఉంటుందని.. రెండోసారి సమర్పించిన బిల్లును రాష్ట్రపతి ఆమోదం కోసం రిజర్వు చేసే అధికారం గవర్నర్లకు లేదని గతంలోనే తీర్పును ఇచ్చింది.
అంతేకాదు.. నిర్దిష్ట గడువు లోపు గవర్నర్ చర్య తీసుకోకుంటే గవర్నర్ పైనా చర్యలకు అవకాశాన్ని ప్రస్తావిస్తూ.. జ్యూడిషియల్ స్క్రూటినీని ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించింది. తాజా పరిణామాల నేపథ్యంలో తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయాన్ని తీసుకుంది. గవర్నర్ తొక్కి పెట్టిన పది బిల్లులకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వటంతో తమిళనాడు ప్రభుత్వం పది చట్టాలను  నోటిఫై చేసింది. ఇందుకు సంబంధించిన గెజిట్ నోటిఫికేష్ ను జారీ చేసింది. రాష్ట్రపతి.. గవర్నర్ ఆమోదం లేకుండా పది చట్టాలను నోటిఫై చేయటం రాజ్యంగ చరిత్రలో ఇదే తొలిసారిగా చెబుతున్నారు.

Recent Comments
Leave a Comment

Related News